Telangana News: పెండింగ్ చలాన్లు చెల్లించారా.? - వాహనదారులకు బిగ్ అలర్ట్
Challans Discount: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించడంతో భారీ స్పందన లభిస్తోంది. చలాన్ల చెల్లింపునకు ఈ నెల 10 వరకూ మాత్రమే టైం ఉందని, సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు సూచించారు.
Discount on Pending Challans in Telangana: తెలంగాణలో (Telangana) పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు చెల్లించేందుకు వాహనదారులకు ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పోలీస్ రికార్డుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. ఈ క్రమంలో డిసెంబర్ 25 వరకూ ఉన్న చలాన్లపై ప్రభుత్వం భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ద్విచక్రవాహనాలు, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించడంతో అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ మేరకు గత నెల 26 నుంచి 11 రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 76.79 లక్షల చలాన్లకు సంబంధించి రూ.66.77 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఈ అవకాశం ఈ నెల 10 వరకూ (5 రోజులు) మాత్రమే ఉందని నగర ట్రాఫిక్ అదనపు సీపీ ఎం.విశ్వప్రసాద్ తెలిపారు. వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వాహనదారులకు అలర్ట్
అయితే, పెండింగ్ చలాన్ల చెల్లింపునకు పెద్ద ఎత్తున వాహనదారులు ముందుకు వస్తుండడంతో ఇదే అదునుగా కొందరు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. www.echallantspolice.in నకిలీ వెబ్ సైట్ సృష్టించి చలాన్లు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనదారులను అప్రమత్తం చేశారు. జాగ్రత్తగా ఉండాలని ఈ వెబ్ సైట్ లో చెల్లింపులు చెయ్యొద్దని స్పష్టం చేశారు. మీ సేవ, పేటీఎం, టీ వ్యాలెట్, నెట్ బ్యాంకింగ్ ద్వారానూ చెల్లింపులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అలాగే www.echallan.tspolice.gov.in/publicview వైబ్ సైట్ లో చెల్లించాలని చెప్పారు. చలానాల చెల్లింపులో ఎలాంటి సందేహాలు ఎదురైనా 040 - 27852721, 8712661690 (వాట్సాప్) నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
నగరవాసులకు మరో అలర్ట్
ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad) లో నుమాయిష్ (Numaish) ప్రారంభం కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్ జరిగే నాంపల్లి గ్రౌండ్స్ చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలో ఆ వైపుగా వెళ్లే వాహనదారులను పోలీసులు అలర్ట్ చేశారు. వారాంతాల్లో వీలైనంత వరకూ ఆ మార్గాల్లో వెళ్లొద్దని సూచించారు. అటు, సిద్దంబర్ బజార్ వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఇతర భారీ వాహనాలను మొహింజా మార్కెట్ వద్ద అబిడ్స్ వైపు మళ్లిస్తున్నారు. అలాగే, బషీర్ బాగ్, కంట్రోల్ రూం వైపు నుంచి నాంపల్లికి వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద బీజేఆర్ విగ్రహం, అబిడ్స్ వైపు మళ్లిస్తున్నారు. బేగంబజార్, ఛత్రి నుంచి మలాకుంట వైపు వెళ్లే వాహనాలను అలస్క జంక్షన్ వద్ద దారుసలాం, ఏక్ మినార్ వైపు మళ్లిస్తున్నారు. అలాగే దారుసలాం నుంచి అఫ్జల్ గంజ్ వైపు వెళ్లే వాహనాలను అలస్క జంక్షన్ నుంచి బేగంబజార్, సిటీ కాలేజ్ రూట్ కు మళ్లించారు. మూసాబౌలి, బహదూర్ పురా వైపు నుంచి నాంపల్లికి వెళ్లే వాహనాలు సిటీ కాలేజీ, నయాపూల్, ఎంజే మార్కెట్ రూట్ లో వెళ్లాల్సి ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఫిబ్రవరి 14 వరకూ ఈ ఆంక్షలు ఉండనున్నాయి. వాహనదారులు గమనించి సహకరించాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read: Formula E Race: హైదరాబాద్‌లో జరగాల్సిన కారు రేస్ రద్దు- కేటీఆర్, ఫార్ములా ఈ చీఫ్ అసంతృప్తి