అరవింద్ సంస్కార హీనుడు, కవితమ్మ చెప్పు దెబ్బల కామెంట్లు సరైనవే: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
Vemula Prashanth Reddy on Kavitha Comments: సీఎం కేసీఆర్ తన బిడ్డను అమ్ముకుంటున్నారని అరవింద్ నీచంగా మాట్లాడాడని, అందుకే అరవింద్ రాజకీయాలకే ఓ కళంకం అంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.
Vemula Prashanth Reddy on Kavitha Comments: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సమర్ధిస్తున్నానని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అరవింద్ వ్యవహరిస్తున్న తీరుకు కవితమ్మ తిట్టిన తిట్లు తక్కువేనని, రాజకీయాల్లో సంస్కార హీనుడు అన్నారు. ఎందరో ఎన్నిసార్లు చెప్పినా అరవింద్ తీరు మార్చుకోలేదని, తెలంగాణ సీఎం కేసీఆర్ తన బిడ్డను అమ్ముకుంటున్నారని అరవింద్ నీచాతి నీచంగా మాట్లాడాడని, అందుకే అరవింద్ రాజకీయాలకే ఓ కళంకం అంటూ మండిపడ్డారు. కవితమ్మ చెప్పుతో కొడతా అన్నది ముమ్మాటికీ కరెక్టు అని, నిజామాబాద్ కు ఎంపీగా అరవింద్ చేసింది శూన్యం అన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల, ఎమ్మెల్సీలు వి. గంగాధర్ గౌడ్, రాజేశ్వర్ రావులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
వార్తల్లో నిలిచేందుకు అరవింద్ సంచలన ప్రకటనలు
‘పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి మాట తప్పిన వ్యక్తి ఎంపీ అరవింద్. ఆయనను ప్రజలు గ్రామాల్లోకి రానివ్వడం లేదు. గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉంది కనుకే అరవింద్ వార్తల్లో ఉండేందుకు సంచలన ప్రకటనలు చేస్తున్నారు. కేటీఆర్, కవిత కష్ట కాలంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉన్నారు. అమెరికాలో మంచి ఉద్యోగాలను వదిలి ఉద్యమంలో పాలు పంచుకున్నారు. వారు కేసీఆర్ ను వదిలి ఎక్కడికి వెళుతారు. కానీ కవిత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తో మాట్లాడింది నువ్ చూశావా అరవింద్. ఏదో ఒక్కటి కెలుక్కుని తెలంగాణలో శాంతి భద్రతల సమస్య తేవాలని బీజేపీ కుట్ర పన్నింది. కేసీఆర్ ను, కవితను అనరాని మాటలు అంటే అభిమానులు ఊరుకుంటారా అని’ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.
‘ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ డ్రామాలు, సర్కస్ లు చేస్తోంది. ప్రత్యర్థి రాజకీయ పార్టీల కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టడం బీజేపీకి కొత్త కాదు. గతంలో శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్, హేమంత్ సొరేన్, రామ్ విలాస్ పాశ్వాన్, కృష్ణ పటేల్ లాంటి నేతల కుటుంబాల్లో చిచ్చు పెట్టిన పార్టీ బీజేపీ. ఇది బీజేపీ దగుల్భాజీ రాజకీయం కాదా. తల్లికి బిడ్డకు, అన్నకు తమ్ముడికి కొట్లాట పెట్టి ప్రభుత్వాలను కూల గొడుతున్న పార్టీ బీజేపీ. కవితమ్మ అన్న దాంట్లో తప్పేమి ఉంది. కవిత ఇంటిపై దాడి జరిగినపుడు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లు ఎక్కడ ఉన్నారు. కేసీఆర్ బిడ్డను అమ్ముకుంటున్నాడు అని అరవింద్ ఆరోపణలు చేసినపుడు మహిళ ఆయిన గవర్నర్ తమిళిసై ఏమి చేస్తున్నారు.
రాజకీయాల్లో సంస్కార హీనుడు అర్వింద్ : మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి.@VPRTRS pic.twitter.com/zW8Sk3s9bg
— TRS Party (@trspartyonline) November 19, 2022
బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయ్యాకే రాజకీయాల స్థాయి దిగజారింది. తిట్లు టిడితేనే వార్తకు ప్రాముఖ్యత వస్తుండటం దురదృష్టకరం. కేసీఆర్ ను బండి సంజయ్ ఫెయిల్యూర్ సీఎం అంటున్నారు. అభివృద్ధి ఏ సూచికలు తీసుకున్నా జాతీయ స్థాయి కన్నా తెలంగాణ ముందుందని బండి సంజయ్ కు తెలియదా. పీఎం మోదీ ఓ ఫెయిల్యూర్ ప్రధాన మంత్రి. కేసీఆర్ ఏ అంశాల్లో సఫలం అయ్యారో అవే అంశాల్లో మోదీ విఫలం అయ్యారు. జీడీపీ, జాతీయ తలసరి ఆదాయం లో మోదీ దేశాన్ని దిగజార్చారు. రూపాయి విలువను మోదీ దిగజార్చారు. ఎపుడు ఎన్నికలు వస్తాయో ప్రజలు ఎదురు చూస్తున్నారని బండి సంజయ్ అంటున్నారు
మునుగోడులో ఓటమి పాలయినా బీజేపీ బుద్ది మారడం లేదు. అరవింద్ తన తీరు మార్చుకోక పోతే ప్రజలు నిజామాబాద్ లో ఉరికించి ఉరికించి కొడతారు. అరవింద్ ఇంట్లో మూడు పార్టీల వ్యక్తులు ఉన్నారు. కాంగ్రెస్ తో కుమ్మక్కయినందు వల్లే అరవింద్ ఎంపీగా గెలిచారు. అనుకోకుండా అరవింద్ ఎంపీగా గెలిచారని, అరవింద్ భాషపై పౌర సమాజం, మీడియా కూడా స్పందించాలన్నారు’ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.