Nizamabad News: గుడిలో చోరీ అయిన విగ్రహాలు ఆటోలో వచ్చాయి.. చూసి ఆశ్చర్యపోయిన పూజారి
నిజామాబాద్ జిల్లా కందకుర్తి పురాతన రామాలయంలో వీడిన చోరీ మిస్టరీ. దొంగిలించిన వారే విగ్రహాలను తిరిగి పెట్టారు. అన్నదానం సామాగ్రి అంటూ చోరీ వస్తువులను పెట్టి వెళ్లిన వైనం. చోరీపై ఆరా తీస్తున్న పోలీసులు.
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తిలో పురాతన రామాలయంలో ఈ నెల 7వ తేదీని చోరీ జరిగింది. పురాతన దేవత మూర్తుల విగ్రహాలు, కిరీటాలు చోరీ అయ్యాయని ఆలయ పూజారి రెంజల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
గాలింపు జరుగుతున్న టైంలో ఈ నెల 30న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆలయంలో మళ్లీ విగ్రహాలు కనిపించాయి. విగ్రహాలతోపాటు చోరీ అయిన సామగ్రి కూడా పూజారికి ఇచ్చి వెళ్లిపోయారు.
గత నెల 25వ తేదీ సాయంత్రం 7.25 ప్రాంతంలో ఆలయంలో పూజారీ పూజలు నిర్వహిస్తుండగా.. ఓ ఇద్దరు వ్యక్తులు గుడి లోపలికి వచ్చి బిర్జు మహారాజ్ జోషి అన్నదానం కోసం సామాగ్రి పంపించారని ఆలయ పూజారికి చెప్పారు. దీంతో పూజారి ఆ సామాగ్రి కోసం ఆలయం నుంచి బయటకు వచ్చారు. ఆటోలో ఉన్న సామాగ్రిని ఆ ఇద్దరు వ్యక్తులు పూజారి ఆనంద్ మహారాజ్ ఇంట్లో పెట్టించారు.
ఆ సామాగ్రి పంపిన బిర్జూ మహారాజ్ ఎవరో పూజారి ఆనంద్ మహారాజ్ కు తెలియదు. ఆలోచనలో పడ్డ పూజారి ఆ సామాగ్రిని విప్పలేదు. అయితే ఫిబ్రవరి 2న రామాలయంలో అన్నదాన కార్యక్రమం ఉందని చెప్పడంతో ఈ నెల 30న ఆ సంచుల్లో ఉన్న సామాగ్రిని విప్పి చూడగా ఒక సంచిలో 10 కిలోల బియ్యం, 5 కిలోల రవ్వ, 5 కిలోల పంచదార ఉన్నాయి. మరో సంచి విప్పగా అందులో 3 అట్ట డబ్బాలు కనిపించాయి. వాటిని విప్పి చూస్తే సీతారాముల ఉత్సవ విగ్రహం కనిపించింది.
పూజారీ ఆనంద్ మహారాజ్ వెంటనే ఈ విషయాన్ని మిగతా పూజారులు యోగేష్, శ్రీధర్ మహారాజ్‌కు చెప్పారు. పోలీసులకు కూడా చేరవేశారు. మిగతా రెండు అట్టడబ్బాలు విప్పడంతో అందులో ఆలయంలో చోరీకి గురైన పురాతన విగ్రహాలు అన్ని ఉన్నాయ్. కేసు నమోదైన నాటి నుంచి పోలీసులు స్పెషల్ టీంను ఏర్పాటు చేసి టెక్నికల్ ఎవిడెన్స్‌తో దర్యాప్తు ప్రారంభించారు.
చోరీ చేసిన వారు ఎలాగైనా దొరికిపోతామనే భయంతో ఆటో డ్రైవర్ ద్వారా విగ్రహాలను పంపినట్లు పోలీసులు చెబుతున్నారు. చోరీకి గురైన సామాగ్రి పంచ లోహ విగ్రహలైన రాముడు, సీత (20 కేజీలు), రాగి విగ్రహలైన రాముడు, సీత, లక్ష్మణుడు, వినాయకుడు, వేంకటేశ్వర స్వామి, లక్ష్మి, పద్మావతి దేవి, విష్ణుమూర్తి, గరుడ, హనుమంతుడు (మొత్తం 5 కేజీలు), ఇత్తడి విగ్రహలైన శ్రీకృష్ణుడు, గుర్రం (1 కేజీ), ఐదు విగ్రహాల వెండి కిరీటాలు. వీటన్నింటినీ తిరిగి ఆలయంలో పెట్టేశారు పూజారులు. అయితే చోరీ చేసిందెవరన్నదానిపై పోలీసులు ఆరా తీసే పనిలో పడ్డారు.