Nizamabad Politics: రేవంత్ రెడ్డి పాదయాత్రతో నిజామాబాద్ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్!
నిజామాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్. రేవంత్ పాదయాత్రకు జిల్లాలో అనూహ్యస్పందన. జిల్లాలో పూర్వవైభవం తీసుకురావాలని నేతలకు పీసీసీ చీఫ్ హితవు.
నిజామాబాద్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందంటున్నారు జిల్లా నాయకులు. అడుగడుగునా రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి గతంలో కంచుకోటలా ఉండేది. ఇప్పటికీ హస్తం పార్టీకి జిల్లాలో భారీగా ఓటు బ్యాంకు పదిలంగా ఉందంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. జిల్లాలో చాలా మంది కీలక నాయకులు ఇతర పార్టీల వైపు చూడటంతో కొంత కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందన్నది వాస్తవమే అంటున్న హస్తం శ్రేణులు జిల్లాలో రేవంత్ రెడ్డి చేసిన పాదయాత్ర చేయడంతో పాటు ఆయన పాదయాత్ర చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులను పిలిపించుకుని పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకుని... పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేసే దిశగా రేవంత్ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారని సమాచారం. దీంతో పార్టీకి దూరంగా ఉంటున్న నాయకులు సైతం తిరిగి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు ముందుకోస్తున్నట్లు తెలుస్తోంది.
నిజామాబాద్ జిల్లాలో మొదటగా రేవంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్ పల్లిలో పాదయాత్ర ప్రారంభించి ఏర్గట్ల మండలంలో కార్నర్ మీటింగ్ తో ముగించారు. బాల్కొండ నియోజక వర్గంలో రేవంత్ పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చిందని జిల్లా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. రేవంత్ కూడా సంతృప్తి చెందారనిబాల్కొండ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. నిజామాబాద్ అర్బన్, బోధన్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పాదయాత్రకు జనాలు కూడా బాగానే వచ్చారని అంటున్నారు. ఒక్క నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో జరిగిన పాదయాత్ర, కార్నర్ మీటింగ్ లో జనాలు అంతగా రాలేదన్నది కాంగ్రెస్ వర్గాల్లో చర్చ. ఆ నియోజకవర్గంలో నగేష్ రెడ్డి, భూపతి రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. దీంతో సరైన కో ఆర్డినేషన్ లేకపోవటంతో అక్కృడ కార్నర్ మీటింగ్ అంత సక్సెస్ కాలేదన్న వాదన ఉంది.
జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర, కార్నర్ మీటింగుల్లో రేవంత్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ద్వజమెత్తారు. స్థానికంగా ఉన్న సమస్యలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పలు పరిణామాలపై రేవంత్ ప్రభుత్వాన్ని ఎక్కడిక్కడ నిలదీశారు. రేవంత్ ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. రేవంత్ పాదయాత్రకు ఊహించని విధంగా ప్రజల నుంచి మద్దతు లభించిందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. అయితే ఇప్పటి వరకు జిల్లాలో కాంగ్రెస్ బడా నేతలు క్యాడర్ ను సరిగ్గా పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. నేతల మధ్య కొరవడిన సఖ్యతపై రేవంత్ వారికి పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. జిల్లాలో గతంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న డీఎస్ సైతం తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారన్న వార్తలతో తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు.