పసుపు బోర్డు చిన్నదవుద్దని స్పైస్ బోర్డుకు ట్రై చేస్తున్నాం: ఎంపీ అర్వింద్
పసుపు బోర్డు ప్రత్యేకంగా చేస్తే చిన్నగా అవుతుందన్నారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. స్పైస్ బోర్డు తీసుకుంటే వ్యవస్థ పెద్దదని అభిప్రాయపడ్డారు.
నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. తాను వేల్పూర్‌కి వెళ్తుంటే...జాతీయ గీతాలాపన కోసం బలవంతంగా ట్రాఫిక్ ఆపేశారని అన్నారు. జాతీయ గీతం పాడటం వ్యతిరేకం కాదు.. జబర్దస్త్ చెయ్యడం సరి కాదన్నారు. ప్రశాంత్ రెడ్డి ఓటమికి చరమ గీతం పాడుతామన్నారు. 2014 తెరాస ఎన్నికల మ్యానిఫెస్టో తమకు భగవద్గీత అని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.
నిజామాబాద్ జిల్లా చెరుకు, పసుపు పరిశోధన స్థానం ఏర్పాటు చేస్తామని అన్నారని గుర్తు చేశారు రఘునందన్‌రావు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు మార్కెట్ ఇంటర్వేన్షన్ ఫండ్ ఇప్పిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పినట్టు వెల్లడించారు. కానీ ఇప్పటి దాకా మార్కెట్ ఇంటర్వేన్షన్ కోసం రాష్ట్రం లేఖ రాయలేదని కేంద్ర మంత్రి చెప్పారన్నారు. 2018 డిసెంబర్ 2న మళ్లీ మ్యానిఫెస్టోలో ఇచ్చారని తెలిపారు. ఏకకాలంలో రైతులకు ప్రకటించిన రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా సరే రుణమాఫీపై చర్చకు సిద్దమన్నారు.
భయపెడితే బెదిరే వాళ్ళు ఎవ్వరూ లేరన్నారు రఘునందన్‌రావు. వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద ధర్నా అనగానే మంత్రి వీడియోలు చేసి పెట్టారన్నారు. మోర్తాడ్ సభలో ఎర్రజొన్న, పసుపు కొమ్ము, అల్లం కొమ్ము, పచ్చజొన్న కొంటామని ప్రకటించారని ఎద్దేవా చేశారు. సీఎం స్వయంగా హామీ ఇచ్చినా ఇప్పటిదాకా కొనలేదని ఆరోపించారు. సీఎం హామీ నిలబెట్టుకుంటే అర్వింద్ తన హామీ ని నిలుపుకుంటారని తేల్చి చెప్పారు.
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేస్తే...
బాల్కొండ నియోజకవర్గంలో 2580 ఇల్లు మంజూరు అయితే 112 ఇళ్ళు కట్టి పంపిణీ చేశారని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే సమాధానం ఇచ్చారన్నారు. సిద్దిపేటకు 4171 ఇళ్లు ఇస్తే 3027 ఇళ్ళు పూర్తి చేశారని తెలిపారు. సిరిసిల్లలో 4878 ఇళ్ళు ఇస్తే 3756 పూర్తి చేశారని... గజ్వేల్‌లో 3502 ఇళ్ళు ఇస్తే 3099 పూర్తి చేశారని సమాచారం ఇచ్చారు. రెండు పడక గదుల ఇంటి పథకం కొనసాగిస్తూ సొంత జాగా ఉంటే పేదలకు ఇంటి నిర్మాణం కోసం 5 నుంచి 6 లక్షలు ఇస్తామన్నారు. సీఎం, మంత్రులు తప్ప ఎవ్వరికీ ఒక్క ఇల్లు రాలేదన్నారు. వంద బెడ్ రూమ్‌లతో పదేకరాల్లో సీఎం ఇల్లును ప్రశాంత్‌రెడ్డి కట్టించి ఇచ్చారని ఆరోపించారు.
రెండు మ్యానిఫెస్టోల్లో ఇచ్చిన హామీల్లో ఏమి ఇచ్చిరో అడగడానికి వచ్చాం అన్నారు రఘునందన్‌రావు. కేసీఆర్‌కు పదిళ్లు ఉండి.. పదకొండో ఇళ్ళు కట్టినా ఎవ్వరూ బాధపడలేదు కానీ... పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టకపోవడం సమంజసమేనా అని నిలదీశారు. ఇళ్ళు ఎందుకు పూర్తవ్వడం లేదని అడిగితే... ఇసుక, సిమెంట్ దొరకడం లేదని సాకులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో గెలిచిన రెండు రోజుల్లో వంద పడకల ఆస్పత్రిని మంత్రి హరీష్ రావుతో ప్రారంభింపజేశామన్నారు.
అసెంబ్లీలో ఉంటే నిలదీస్తారని రఘునందన్ సహా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నారన్నారు ఎంపీ అర్వింద్. వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద ధర్నా పెడితే ప్రశాంత్‌రెడ్డికి ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. తాను ఎంపీ అయ్యాక ఐదు నెలల్లో ఎంత చెయ్యాలో పసుపు రైతులకు అంత చేశానంటూ వివరించారు. రైతులతో అనేక సమావేశాలు పెట్టామని... పసుపు బోర్డు ప్రత్యేకంగా చేస్తే చిన్నగా అవుతుందన్నారు. స్పైస్ బోర్డు తీసుకుంటే వ్యవస్థ పెద్దదని అన్నారు. నిజామాబాద్‌లో విస్తరణ కార్యాలయం ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా రూ.30కోట్లు కేవలం పసుపు రైతుల కోసమే కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. గుజరాత్‌లో ఫసల్ బీమా యోజన కింద సీఎం కిసాన్ యోజన కింద పంటలకు పరిహారం అందిస్తున్నారని వివరించారు.