అటవీ భూముల్లో సాగు చేసే పేదవారికి ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు: మంత్రి ప్రశాంత్ రెడ్డి
భవిష్యత్తులో అడవుల నరికివేత ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదనేదే సీఎం కేసీఆర్ అభిప్రాయమని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అడవుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు.
Minister Prashanth Reddy: భవిష్యత్తులో అడువుల నరికివేత ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదనేదే సీఎం కేసీఆర్ ఉద్దేశం అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో తమ తమ గ్రామాల్లోని అడవిని, అటవీ భూముల్ని కాపాడుకోవడానికి పూర్తి బాధ్యత గ్రామాల్లోని అన్ని రాజకీయ పార్టీలు తీసుకోవాలని సూచించారు. అడవుల పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఉన్నతాధికారులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకునేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇకపై భవిష్యత్తులో అడవుల నరికివేత ఎట్టి పరిస్థితుల్లో జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అలాగే పోడు భూముల సమస్యలపై మంత్రి వేముల.. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఉన్నతాధికారులతో వేర్వేరుగా బుధవారం సమీక్షా సమావేశాలు నిర్వహించారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి నిబంధనలను అనుసరిస్తూ చేపట్టాల్సిన చర్యల గురించి, అటవీ విస్తీర్ణం పెంపొందించాల్సిన ఆవశ్యకత గురించి మంత్రి ఈ సందర్భంగా అధికారులకు వివరించారు.
డేగ కన్నుతో నిఘా కొనసాగించాలి..
ప్రస్తుతం ఉన్న చట్టాలకు లోబడి అటవీ భూముల్లో వ్యవసాయం చేసుకొని బతుకుతున్న పేదవారికి ఆఖరి అవకాశంగా ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అయితే, ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో అటవీ ప్రాంతంలోని ఏ ఒక్క చెట్టు కూడా నరికివేతకు గురికాకుండా అడుగడుగునా బీట్ స్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే బీట్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది నిరంతరం డేగ కన్నుతో నిఘాను కొనసాగించాలని ఆదేశించారు. అవసరమైతే పోలీసు శాఖ సహాయం తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంతంలో ఏ ఒక్క చెట్టును నరికినా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయమై ఇక నుంచి భవిష్యత్తులో తమ తమ గ్రామాల్లోని అడవిని, అటవీ భూముల్ని కాపాడుకోవడానికి అంకిత భావం, చిత్తశుద్ధితో కృషి చేస్తామని అన్ని రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా..
ఆయా ఫారెస్ట్ రేంజ్‌ల వారీగా అటవీ విస్తీర్ణం, ఫారెస్ట్ బీటలు, సిబ్బంది సంఖ్య తదితర వివరాలను మంత్రి ఆరా తీస్తూ, అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న చోట అదనపు సిబ్బందిని సర్దుబాటు చేయాలని నిజామాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనాకు మరియు కామారెడ్డి అటవీ శాఖ అధికారి నిఖితకు సూచించారు. హరితహారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనలేని ప్రాధాన్యతను ఇస్తున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల ఫలితంగా ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణలో 2021 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 6 శాతం అటవీ విస్తీర్ణం వృద్ధి చెందిందన్నారు. మరో మూడు శాతం కలుపుకుని మొత్తంగా తొమ్మిది శాతం వరకు అటవీ విస్తీర్ణాన్ని పెంచుకోగలిగితే వర్షాభావ పరిస్థితులను నివారించుకుని సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుందన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా అటవీ విస్తీర్ణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హితవు పలికారు. ఈ సందర్భంగా పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న చర్యలు, గ్రామ, డివిజనల్, జిల్లా స్థాయిలలో కమిటీల ఏర్పాటుకు చేస్తున్న కసరత్తులు గురించి కలెక్టర్ మంత్రి దృష్టికి తెచ్చారు.