(Source: ECI/ABP News/ABP Majha)
Kamareddy: వేటకు వెళ్లి గుహలో పడ్డ యువకుడు - తలకిందులుగా ఇరుక్కుపోయి రెండ్రోజులుగా నరకయాతన
Kamareddy News: అడవిలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు గుహలో ఇరుక్కుపోయిన యువకుడిని కాపాడేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రి మూడింటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.
Kamareddy News: కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో వేటకు వెళ్లిన ఓ వ్యక్తి అనుకోకుండా జారి పడ్డాడు. ఇలా పడి ఓ గుహలో ఇరుక్కుపోయాడు. మంగళవారం సాయంత్రం నుంచి అదే గుహలో నరకయాతన అనుభవిస్తున్నాడు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. జేసీబీలు, హిటాచీలతో ప్రయత్నించినా అతడిని బయటకు తీయలేకపోతున్నారు. అయితే విషయం తెలుసుకున్న గ్రామస్థులు, స్థానికులు అంతా అక్కడకు చేరుకొని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన 38 ఏళ్ల షాడ రాజు మంగళ వారం రోజు సాయంత్రం ఘన్ పూర్ శివారులో వేటకు వెళ్లాడు. అక్కడే ఉన్న ఒక గుహలోకి వెళ్లేందుకు అతడు ప్రయత్నించాడు. కానీ అదే సమయంలో అతడి ఫోన్ కింద పడిపోయింది. తీసేందుకు చాలానే ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే గుహలో మరింతగా ఇరుక్కుపోయాడు. అయితే ఈ ప్రమాద సమయంలో అతడితో పాటు మహేశ్ అనే మిత్రుడు కూడా ఉన్నాడు. మంగళవారం ఎంత ప్రయత్నించినా రాజు బయటకు రాలేకపోయాడు. బుధవారం కూడా కొందరు గ్రామస్థులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో గ్రామస్థులు పోలీసులు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు యువకుడిని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే అగ్నిమాపక సిబ్బంది రెవన్యూ, అటవీ శాఖ అధికారులతో సంఘటనా స్థాలానికి చేరుకున్నారు. పోలీసులు జేసీబీల సాయంతో రాళ్లను తొలగించేందుకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని జేసీబీలు, కంప్రెషర్లు తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రి కూడా సహాయక చర్యలు కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు.