Kamareddy Master Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై స్టేకు హైకోర్టు నిరాకరణ, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ స్టే కు నిరాకరించిన హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. విచారణ్ ఈ నెల 25కు వాయిదా. కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ ఎదుట మహా ధర్నా నిర్వహిస్తున్న రైతులు.
Kamareddy Master Plan Issue: కామారెడ్డి పట్టణంలో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మాస్టర్ ప్లాన్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మాస్టర్ ప్లాన్ పై విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది హైకోర్ట్. అయితే కామారెడ్డి టౌన్ ప్లానింగ్ విషయంలో ఇప్పటికిప్పుడు జరిగేేదేమీ లేదంది హైకోర్ట్. హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ విషయంలో ఏళ్ల తరబడి ఊగిసలాట కొనసాగుతోందని వ్యాఖ్యానించింది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేదన్నది బెంచ్ వ్యాఖ్య. అయితే మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలను తీసుకుంటున్నామని అడ్వకేట్ జనరల్ తెలిపారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో రైతులు బైఠాయించారు. మహా ధర్నాపేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో 8 గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం చేయాలని రైతులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఇండస్ట్ర్రీయల్ జోన్ పేరుతో తమకు తీరని అన్యాయం జరుగుతోందని రైతులు మొదట్నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ పై ఇవాళ్టితో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగియనుండనున్న నేపథ్యంలో గురువారం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేయాలని రైతులు పట్టుబడుతున్నారు. ఇప్పటికే బాధిత రైతులు కామారెడ్డి పట్టణానికి చెందిన 49 మంది కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేయాలని వినతి పత్రాలు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.
కుటుంబాలతో మున్సిపల్ ఆఫీస్ ఎదుట రైతుల ధర్నా..
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో తమ భూములు ఇండస్ట్రీయల్ జోన్ లోకి వెళ్తున్నయని ఆవేదన వ్యక్తం చేస్తూ గత మూడు వారాలుగా రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట 8 గ్రామాలకు చెందిన రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మహా ధర్నా నిర్వహిస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా రైతులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్ కుట్ర పూరితమైనదని... బడా బాబులు, ప్రజా ప్రతినిధులు తమ స్వార్థం కోసం మా భూములను ఇండస్ట్రీయల్ జోన్ లోకి నెడుతున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ విషయంపై కలెక్టర్ జితేష్ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వివరణ ఇచ్చారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరక్కుండా చూస్తామని చెప్పారు. మాస్టర్ ప్లాన్ ఇంకా ఫైనల్ కాలేదని కూడా తెలిపారు. అయితే కర్షకులు వారి మాటలను నమ్మటం లేదు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తే గానీ తాము ఆందోళనలు విరమించేది లేదని అన్నదాతలు స్పష్టం చేస్తున్నారు. ఎంతవరకైనా పోరాటం చేస్తామని అంటోంది రైతు జేఏసీ.
రైతు మహా ధర్నాకు బీజేపీ మద్దతు....
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన మహా ధర్నాకు బీజేపీ పూర్తి మద్దతు తెలిపింది. కామారెడ్డి నియోజకవర్గ అసెంబ్లీ ఇంఛార్జ్ వెెంకట రమణ రెడ్డి, స్థానిక బీజేపీ నాయకులు, బీజేపీ కిసాన్ మోర్చా రైతు మాహా ధర్నాలో పాల్గొన్నారు. అన్నదాతల భూములు ఇండస్ట్రీయల్ జోన్ లోకి వెళ్లకుండా ప్రభుత్వం తక్షణమే మాస్టర్ ప్లాన్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు ఎన్ని రోజులు ఆందోళన చేసినా వారి బీజేపీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఇప్పటికే కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేయాలని బీజేపీకి చెందిన కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం కూడా ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ రద్దుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు బీజేపీ కౌన్సిలర్లు. గురువారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ కు సంబంధించి స్థానిక నాయకులు పెద్దగా లేనప్పటికీ కాంగ్రెస్ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి రైతు మహా ధర్నాకు మద్దతు తెలిపారు.