Telangana News: కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
Adilabad News: కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరవడంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగేస్తున్నారు. సిర్పూర్, ముథోల్ మాజీ ఎమ్మెల్యేలు హస్తం పార్టీ కండువా కప్పేసుకున్నారు.
Telangana Politics : కాంగ్రెస్ పార్టీ (Congress) గేట్లు తెరవడంతో ఆదిలాబాద్ (Adilabad)ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ (Brs)నేతలు ఒక్కొక్కరుగా కారు దిగేస్తున్నారు. సిర్పూర్, ముథోల్ మాజీ ఎమ్మెల్యేలు హస్తం పార్టీ కండువా కప్పేసుకున్నారు. మరోవైపు నిర్మల్, ముథోల్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ కార్యకర్తలంతా పార్టీ మారారు. తాజాగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy) చేరికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఆయన పార్టీలోకి రావడాన్ని స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన వద్దంటే వద్దంటూ ధర్నాలు చేశారు. మంత్రి సీతక్క సమావేశాల్లో సైతం మాజీ మంత్రిని తీసుకొవద్దని డిమాండ్ చేశారు. పార్టీ జెండా మోసిన లీడర్లు...జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు...ఎన్నికల సమాయత్తంపై సమావేశాలు నిర్వహించారు. అక్రమార్కులు, పార్టీని నష్టపర్చే విధంగా పని చేసిన ఇతర నేతలను తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే అదే సమయంలో సీతక్క...చేరికలు వద్దనొద్దని, ఎవరు వస్తే వారిని తీసుకోవాలని కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది.
ఇంద్రకరణ్ రెడ్డిని తీసుకోవద్దని కాంగ్రెస్ నేతల ఒత్తిడి
నిర్మల్‌లోని కాంగ్రెస్ కేడర్ ఏకతాటిపైకి వచ్చి...ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నవారికి సరైన గుర్తింపు, నామినేటెడ్ పదవులివ్వాలని కోరినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇదంతా ఎటో దారి తీస్తుందని అనుకున్నారో ఏమో కానీ...బ్లాక్ మెయిలర్లను, చెరువు కబ్జాదారులను చేర్చుకోబోమని వెడ్మ బొజ్జు హాట్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఉద్దేశించే...వెడ్మ బొజ్జు విమర్శలు చేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మీరు బలంగా ఉంటే పక్కోళ్లు ఎందుకు తీసుకుంటామని మంత్రి సీతక్క పార్టీ నేతలకు స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం, ఎంపీ సీటు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. మంత్రి మాటలు ఒక విధంగా ఉంటే...ఎమ్మెల్యే బొజ్జు మరో అర్థం వచ్చేలా ఉండడంతో కేడర్‌లో గందరగోళం నెలకొంది. నిర్మల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నేతలు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని తీసుకొవద్దని వాదిస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ లో చేరేందుకు ఇంద్రకరణ్ రెడ్డి తహతహ
ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కప్పేసుకుందామనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఓ దఫా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో భేటీ అయ్యారు. హస్తం పార్టీలో చేరడం కోసం మాజీ మంత్రి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే...ఇదిగో అదిగో చేరిక అంటూ ఆయన అనుచరులు లీకులిస్తున్నారు. వీటన్నింటిన చూస్తున్న నిర్మల్ కాంగ్రెస్ నేతలు...అలాంటి వారిని తీసుకోవడం పార్టీకి నష్టం జరగుతుందని సుతిమెత్తగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సీటు గెలవాలంటే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టంగా ఉండాలని హైకమాండ్ భావిస్తోంది. అక్రమార్కులు, అవినీతి పరులు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అహంకారంగా వ్యవహరించి...పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టించిన వారినెలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తీసుకుంటే ఒకటి..లేదంటే మరోటి అన్నట్టుగా పార్టీకి...ముందు నుయ్యి వెనుక గొయ్యిలా పరిస్థితి తయారైనట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ కార్యకర్తలు సహకరిస్తారా ?
ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క, నిర్మల్ జిల్లాలో ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాటల్లో తేడాలపై పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు చేసిన వ్యాఖ్యలను కంట్రోల్ చేసేందుకు....ఇంద్రకరణ్ రెడ్డిని రాకను సీతక్క, ఇతర నేతలు వ్యతిరేకిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ హైకమాండ్ ఏం చెబితే... అదే చేద్దామని చెప్పడంలో ఆంతర్యమేంటని కేడర్లో చర్చ సాగుతోంది. తనకున్న రాజకీయ పలుకుబడి, బంధువర్గం, రెడ్డి సామాజికవర్గం నేతల ద్వారా కాంగ్రెస్ లో చేరాలని భావిస్తున్నారు. అయితే పార్టీ కోసం పని చేసి ఇన్నాళ్ల జెండా మోసిన నాయకులు, కార్యకర్తలు సపోర్ట్ చేస్తారా అన్న అనుమానాలు వెంటాడుతున్నాయి.