Kakinada SEZ: కాకినాడ సెజ్ భూముల రైతులకు గుడ్ న్యూస్! పవన్ కృషి ఫలించిందా? రిజిస్ట్రేషన్ ఫీజులపై ఊరట!
Kakinada SEZ: కాకినాడ సెజ్ భూములపై పోరాటం చేస్తున్న రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. భూములు వెనక్కు ఇవ్వడమే కాకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ మినహాయించింది.

Kakinada SEZ: కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) సెజ్ భూములపై సుధీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న రైతులుకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.. కాకినాడ సెజ్(ప్రత్యేక ఆర్దీక మండలి) పరిధిలో గతంలో సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. భూములు వెనక్కి ఇవ్వడమే కాకుండా రైతులకు తిరిగి రిజిస్ట్రేషన్ చేసేందుకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ మినహాయిస్తూ నిర్ణయం తీసుకుందన్న విషయంపై కాకినాడ సెజ్ పరిధిలో ఉన్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
1551 మంది రైతులకు మేలు..
కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) పరిధిలోని భూములను తిరిగి రైతులకు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని ఎన్నికల హామీల్లో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. దీంట్లో భాగంగా ఆయన కాకినాడ సెజ్ పరిధిలోని 2,180 ఎకరాల భూములకు స్టాంప్, రిజిస్ట్రేషన్ డ్యూటీలను మినహాయించి తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసేలా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించినట్లు తెలుస్తోంది. దీంతో కాకినాడ తీరంలోని తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల పరిధిలో సుమారు 1.551 మంది రైతులకు మేలు జరగనుంది. ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ శాఖ కాకినాడ సెజ్ రైతులకు కూటమి ప్రభుత్వం ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకోవడంలో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకంగా మారిందంటున్నారు.
2180 ఎకరాలు వెనక్కి.. రైతుల్లో సంతోషం..
కాకినాడ సెజ్ కు భూములు ఇచ్చిన భూముల్లో ఎక్కువగా ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. కాకినాడ సెజ్ పరిధిలో రైతులకు వెనక్కి ఇచ్చిన భూమి, తిరిగి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ కాక సతమతం అవుతున్న పరిస్థితి ఉంది. ఈ భూములకు సంబంధించి మొత్తం 2,180 ఎకరాలను తిరిగి రైతులకు ఇచ్చివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఈ మేరకు కాకినాడ సెజ్ లో అవార్డు భూములను తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలిచ్చారు. ఈ భూముల రిజిస్ట్రేషన్‌లకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీలు రైతుల చి వసూలు చేయకూడదని ఆదేశాలలో పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో జీవో నెం. 12 విడుదల అయినా..
కాకినాడ సెజ్ పరిధిలోని భూములకు రైతులకు తిరిగి అప్పగించే ధంగా గత ప్రభుత్వం జీవో నెం. 12 విడుదల అయినప్పటికీ రైతులకు మాత్రం మేలు జరగని పరిస్థితి కనిపించింది. వెనక్కు ఇస్తున్నట్లు ప్రకటించినా ఆ భూముల రిజిస్ట్రేషన్లు రైతుల పేరున జరగలేదు. దీంతో పిల్లల చదువులు, వివాహాల విషయంలో బ్యాంకుల నుంచి రుణాల పొందే విషయంలోనూ మొండి చేయి ఎదురవుతోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేసేవారు.. రైతుల పేరిట భూములు రిజిస్టర్ కాకపోవడం వల్ల ప్రభుత్వం అందించే రైతు భరోసా పథకాలకు కూడా రైతులు దూరమయ్యారు. ఇటీవలే ఇదే విషయాన్ని జనసేన ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పి.హరిప్రసాద్ కూడా శాసన మండలి దృష్టికి తీసుకువచ్చారు..
రైతుల్లో హర్షాతిరేకాలు..
కాకినాడ సెజ్ రైతులకు స్టాంప్, రిజిస్ట్రేషన్ డ్యూటీలను మినహాయించి తిరిగి రైతుల భూములు రైతులకు తిరిగి రిజిస్ట్రేషన్ చేసేలా ఆదేశాలు విడుదలయ్యాయి. కూటమి ప్రభుత్వం కాకినాడ సెజ్ రైతులకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రికి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కి కృతజ్ఞ తలు తెలిపారు. కాకినాడ సెజ్ పరిధిలోని ఉండిపోయిన భూములను రైతులకు మేలు చేకూరేలా ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలుచేసేలా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రైతులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నారు.
కాకినాడ సెజ్ భూముల వెనుక కథ ఇదీ..
కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) భూములు కాకినాడ జిల్లాలోని ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి మండలాల్లో 2006-2008 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో సేకరించారు. ఈ భూములు మొత్తం 10,000 ఎకరాలకు పైగా ఉన్నప్పటికీ, ప్రస్తుత చర్చలో ఉన్నవి 2,180 ఎకరాలు. అప్పటి ఎక్స్‌పోర్ట్ పాలసీ ప్రకారం SEZలు ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చిన క్రమంలో దీనిని అప్పటి ఏపీ ప్రభుత్వం చేపట్టింది. ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగాల సృష్టి, ఎక్స్‌పోర్ట్ పెంపు కోసం రిలయన్స్, అరోబిందో ఫార్మా వంటి పెద్ద కంపెనీలతో కలిసి స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) ఏర్పాటు చేయడానికి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయగా రైతుల నుంచి భూములు స్వచ్ఛందంగా కొంతమంది వద్ద బలవంతంగా సేకరించారని విమర్శలు వచ్చాయి. చాలా మంది రైతులు పరిహారం తీసుకోకుండా పోరాడారు. ఫలితంగా, భూములు ఎక్కువ సంవత్సరాలు ఖాళీగా ఉన్నాయి. ప్రాజెక్ట్ పెద్దగా అభివృద్ధి చెందలేదు. తాజాగా ఈ భూములు వెనక్కు ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడంతోపాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీలు మినహాయిస్తూ నిర్ణయం కూటమి ప్రభుత్వం నిర్జయం తీసుకుంది..





















