Nizamabad Riyaz Encounter: కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్‌పై నిజామాబాద్ సీపీ క్లారిటీ
Riyaz Encounter Nizamabad | నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల కిందట కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసి పారిపోయిన నిందితుడు రియాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Constable murder case in Nizamabad | నిజామాబాద్: పోలీస్ కానిస్టేబుల్ ను హత్యచేసి తప్పించుకున్న నిందితుడు రియాజ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు రోజులుగా పరారీలో ఉన్న నిందితుడి కోసం కొన్ని టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఆదివారం రియాజ్ ఆచూకీ లభ్యమైంది. సారంగపూర్ అటవీ ప్రాంతంలో రౌడీ షీటర్ రియాజ్ తలదాచుకున్నాడని తెలుసుకున్న పోలీసులు అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో కాలువలోకి దూకి పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు అప్రమత్తమై నిందితుడు రియాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్ సమయంలో పారిపోయే ప్రయత్నం చేయగా ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్లు ప్రచారం జరిగింది.
రియాజ్ ఎన్‌కౌంటర్‌పై నిజామాబాద్ సీపీ క్లారిటీ..
కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసిన నిందితుడు రియాజ్ ఎన్ కౌంటర్ లో హతమయ్యాడన్న వార్తలో నిజం లేదని నిజామాబాద్ సీపీ చైతన్య తెలిపారు. పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు కానీ రియాజ్‌పై ఎలాంటి కాల్పులు జరపలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రియాజ్ ప్రాణాలతోనే ఉన్నాడు. ఒక వ్యక్తితో జరిగిన ఘర్షణలో రియాజ్‌కు గాయాలయ్యాయని, ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని సీపీ చైతన్య క్లారిటీ ఇచ్చారు.
రెండు రోజుల కిందట నిజామాబాద్ జిల్లాలో బైకు మీద తీసుకెళ్తుండగా నిందితుడు కానిస్టేబుల్ ప్రమోద్ మీద కత్తితో దాడి చేసి పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం హాట్ టాపిక్ అయింది. పోలీసులకే రక్షణ కరువైందని కొందరు కామెంట్ చేస్తుంటే, ఓ నిందితుడు పోలీసు మీద కత్తితో దాడి చేస్తుంటే అడ్డుకునేందుకు బదులుగా సెల్ ఫోన్లో వీడియోలు, ఫొటోలు తీసి మానవత్వం లేకుండా ప్రవర్తించారని విమర్శలు వచ్చాయి.
నిజామాబాద్ పట్టణంలో రౌడీ షీటర్ దాడిలో కానిస్టేబుల్ మృతి
— NageshT (@NageshT93116498) October 18, 2025
వినాయక నగర్ ప్రాంతంలో పలు కేసుల్లో నిందితుడైన రౌడీ షీటర్ రియాజ్‌ను బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా ఘటన
కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ ఛాతిపై దాడి చేసి పరారైన రియాజ్
వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ… pic.twitter.com/vjAA4rcSZQ
పీఎస్‌కు తీసుకెళ్తుండగా కానిస్టేబుల్ హత్య
నిజామాబాద్ లో కానిస్టేబుల్‌గా చేస్తున్న ప్రమోద్ తన అన్న కూతురు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకొని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉంది. ఆమెను పరామర్శించడానికి మేనల్లుడు ఆకాష్ తో కలిసి ప్రమోద్ శుక్రవారం సాయంత్రం బైకుపై వెళ్తున్నారు. అదే సమయంలో రియాజ్ కు సంబంధించిన సమాచారం రావడంతో రూట్ మార్చాడు. మేనల్లుడు ఆకాష్ తో కలిసి నిందితుడు రియాజ్ ను పట్టుకునేందుకు ఖిల్లా ప్రాంతానికి వెళ్లాడు. సీసీఎస్ పోలీసులకు విషయాన్ని తెలిపి నిందితుడి కోసం వెతుకుతుండగా అతడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతికష్టమ్మీద కానిస్టేబుల్ ప్రమోద్ నిందితుడ్ని పట్టుకున్నాడు.
మేనల్లుడి సాయంతో తన బైకు మీద మధ్యలో రియాజ్ ను కూర్చోబెట్టుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్తున్నాడు. దారిలో నిందితుడు ఓ కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ ఛాతీలో పొడిచాడు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ప్రమోద్ మేనల్లుడు ఆకాష్ పై సైతం కత్తితో దాడి చేయగా అతడికి గాయాలయ్యాయి. వీరి వెనకాల బైకు మీద వచ్చిన ఎస్సై విఠల్ సైతం నిందితుడి దాడిలో గాయపడ్డాడు. అనంతరం రియాజ్ అక్కడి నుంచి పరారయ్యాడు. నిజామాబాద్ సీపీ సాయి చైతన్య నిందితుడ్ని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. డ్రోన్లు, టెక్నాలజీ సాయంతో చివరికి నిందితుడు రియాజ్ ఆచూకీ కనిపెట్టి అరెస్ట్ చేశారు.






















