Nirmal Master Plan: ఎన్ని కేసులు నమోదైనా, లాఠీలు విరిగినా తగ్గేది లేదు- నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దుపై రఘునందన్ రావు
Nirmal Master Plan Latest News: ఎన్ని కేసులు నమోదు చేసినా, లాఠీలు విరిగినా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయించినట్లే, నిర్మల్ మాస్టర్ ప్లాన్ విషయంలో పోరాటం చేద్దామన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.
Nirmal Master Plan Latest News: నిర్మల్ మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నిర్మల్ మాస్టర్ ప్లాన్ (Nirmal Master Plan)ను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy
) చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేడు మూడో రోజు కొనసాగుతోంది. ఏలేటి ఆమరణ నిరాహార దీక్షకు నిన్న ఈటల రాజేందర్ సంఘీభావం తెలిపారు. నేడు నిర్మల్ బంద్ కు బీజేపి పిలుపునివ్వడంతో నిర్మల్ పట్టణంలో ఆయా వ్యాపార సముదాయాలు బంద్ పాటించాయి. మధ్యాహ్నం తర్వాత పాక్షికంగా బంద్ కొనసాగింది.
నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandhan Rao) హాజరై సంఘీభావం తెలిపారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భూ కబ్జాలు నిర్మల్ నుంచి హైదరాబాద్ గచ్చిబౌలి వరకు కబ్జాలకు పాల్పడకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకోవాలని డిమాండ్ చేశారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు.
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎందరో ఉద్యమకారులకు జన్మనిచ్చిందన్నారు. జల్ జంగిల్ జమీన్ పై కొమరం భీమ్ పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. రాబోయే రోజులలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆక్రమించుకున్న భూములను బయటపెడతామన్నారు. మంత్రి కేటీఆర్ అహంకార భాషతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవహేళన చేస్తాడని మండిపడ్డారు. ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేస్తే ఇచ్చిన భూములు రైతులకే తిరిగి భూములను ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు తెలియవా అని ప్రశ్నించారు.
బీజేపీ పోరాటంతో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ని ప్రభుత్వం రద్దు చేసిన సంగతి గుర్తు చేశారు. నిర్మల్ నూతన మాస్టర్ ప్లాన్ 220 జీ.వోను తక్షణమే రద్దు చేయాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. మంత్రి తన సొంత ఊరు ఎల్లపెల్లిలో తన భూములు విలువ పెంచుకునేందుకే నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం నిర్మించారన్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డికి రైతులందరూ చివరి వరకు మద్దతు తెలపాలన్నారు.
రెండు నెలల కిందట కామారెడ్డిలో ఇలాంటి పంచాయితీ జరిగిందని.. రెసిడెన్షియల్ జోన్లను గ్రీన్ జోన్లుగా, గ్రీన్ జోన్లను ఇండస్ట్రియల్ జోన్లుగా మార్చడంతో ఆందోళనకు గురైన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారని రఘునందన్ రావు గుర్తుచేశారు. బీజేపీ నేత వెంకట రమణారెడ్డి దీనిపై పోరు ప్రారంభిస్తే.. బీజేపీ నేతలు ఏకతాటిపైకి వచ్చి రైతులకు మద్దతు తెలిపామన్నారు. చివరికి తమ పోరాటం ఫలించి కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు అయిందన్నారు. ఎన్ని కేసులు నమోదైనా, ఎన్ని లాఠీలు విరిగినా పోరాటం ఆగదన్నట్లుగా రైతులు, మహిళలు ముందుకు వచ్చారని.. ఇప్పుడు నిర్మల్ మాస్టర్ ప్లాన్ విషయంలోనూ తగ్గేదే లేదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లోనూ అనేక ఉద్యమాలు జరిగాయని, నేడు మరోసారి కలిసికట్టుగా ఉద్యమించి నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.