ఆదిలాబాద్ ఐటీడీఏలో CRT నియామకాలపై గిరిజనుల ఆగ్రహం: అవకతవకలపై ఆందోళన!
Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లా ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో జరిగిన సిఆర్టీ పోస్టుల భర్తీపై గిరిజనులు ఆందోళనబాటపట్టారు. నియాకంలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు.

Adilabad Latest News: అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఐటిడిఏ కార్యాలయం ముందు ఆదివాసి విద్యార్ధి, సంఘం నాయకులు, తుడుం దెబ్బ నాయకులు కలిసి ధర్నా చేశారు. మంచిర్యాల-ఆదిలాబాద్ రహాదారిపై రాస్తారోకో చేపట్టారు. ఐటిడిఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్స్ (CRT)ల నియామకం విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
ఉద్యోగాల నియామకంలో ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ ఖుష్బూ గుప్తా అన్యాయం చేసారని గిరిజన యువత మండిపడ్డారు. 2023లో వేసిన నోటిఫికేషన్ ప్రకారమే ఇప్పుడు కూడా అర్హతలు లేని వారిని నియామకం చేస్తున్నారని మండిపడ్డారు. నియామక విషయంలో బుధవారం మీటింగ్ హాలులో డెమో నిర్వహించారు.

ఈ డెమోపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త నోటిఫికేషన్ వేయాలంటూ నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆపేందుకు ప్రయత్నించినా అక్కడ ఆందోళన ఉద్రిక్తంగా మారింది.

నేడు గురువారం రోజున ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తాతో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ నాయకులు, రాజ్ గోండ్ సేవా సమితి ఆదివాసి ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు. సి ఆర్ టి ల నియామకం విషయంలో ఫ్రెష్ నోటిఫికేషన్ వేసి అర్హత గల వారిని ఎంపిక చేయాలన్నారు.

ఈ విషయంలో ఐటిడిఏ పీఓ.. తమకు సరైన న్యాయం చేయడం లేదని, ఆదివాసులతో అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ, ఆదివాసి విద్యార్థి సంఘం నాయకులు ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఐటీడీఏ పీవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మంచిర్యాల - ఆదిలాబాద్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.

తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందుర్ దాదిరావ్, విద్యార్థి సంఘం నాయకుడు గణేష్, ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ నాయకులు పెందుర్ దీపక్ మాట్లాడుతూ " ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని గిరిజన పాఠశాలలలో CRT (కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్స్) ల నియామకంలో అవకతవకలు జరుగుతున్నాయి. 2023లో వేసిన నోటిఫికేషన్‌ను డెమోగా పెట్టి ఎంపిక చేయడం సరైనది కాదు. కొత్తగా నోటిఫికేషన్ వేసి అర్హులైన వారిని నియామకం చేయాలన్నారు. "

ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయంలో చాలామంది సిబ్బంది బదిలీ కాకుండా ఎన్నో ఏళ్లుగా ఒకే చోటా ప్రమోషన్లు పొందుతూ ఉంటున్నారని నేతలు ఆరోపించారు. దీంతో ఐటీడీఏలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, ఉట్నూర్ ఐటిడిఏలో జరుగుతున్న అక్రమాలపై సిబిఐతో విచారణ చేపట్టాలని, ఐటిడిఏ పిఓని బదిలీ చేయాలని, సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్ రావాలని తమకు న్యాయం చేయాలని ఐటిడిఏ పిఓను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు జోక్యం చేసుకొని రోడ్డుపై రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులను పక్కకు తీసుకెళ్లే కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉద్రిక్తత పరిస్థితుల నడుమ పోలీసులు వారికి నచ్చజెప్పి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆందోళన చేయొద్దని చెప్పారు.





















