Adilabad Crime News:ఆదిలాబాద్‌లో మైక్రో ఫైనాన్స్ ముసుగులో భారీ మోసం: 400 మంది నిరుద్యోగులకు కుచ్చుటోపి!
Adilabad Crime News:ఆదిలాబాద్ జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. మైక్రో ఫైనాన్స్ పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టారు. దీంతో 400 మంది యువత రోడ్డున పడ్డారు.

Adilabad Crime News: ఆదిలాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి భారీ హంగామా జరిగింది. పలువురికి ఆర్థిక సహాయం చేశాడు. ప్రజాప్రతినిధులను, సంఘం పెద్దలను పిలిచి సన్మానాలు చేశాడు. బౌన్సర్లను ఏర్పాటు చేసుకోని రెండు నెలల క్రితం డిజిటల్ మైక్రో ఫైనాన్స్ ఆఫీసులు స్థాపించాడు.
అందరికీ మంచి చేస్తున్న ఆ వ్యక్తి స్థాపించిన సంస్థపై ప్రజల్లో నమ్మకం కుదిరింది. ఇంతలో మైక్రో ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగాలు అంటూ ప్రకటన చేశారు. ఆ పనుల కోసం దాదాపుగా 400 మందికిపైగా ఒక్కొక్కరి వద్ద రూ.20,000 వసూలు చేశారు. రెండు నెలలు గడుస్తున్న.. ఆ నిరుద్యోగులు ఆఫీసు చుట్టూ తిరిగిన ఎలాంటి ప్రత్యామ్నాయం లేకపోవడంతో వారంతా ఒక్కొక్కరుగా ఆ ఆఫీసు వద్దకు చేరుకొని పరిశీలించారు. అతడికి ఫోన్ చేసిన ఇదిగో అదిగోనంటూ బుకాయించాడు. బాధితులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో రావడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని దుకాణం మూసుకున్నాడు. దీంతో మోసపోయామన్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం శంకర్ గూడ గ్రామానికి చెందిన జవాదేకృష్ణ గత కొన్నేళ్ల క్రితం గ్రామం వదిలి వెళ్ళిపోయాడు. గతేడాది ఎన్నికల సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నారైగా అడుగుపెట్టాడు. జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులతో తిరుగుతూ అందరికీ సుపరిచితుడయ్యాడు. జిల్లాలో పలువురు పేదలకు ఆర్థిక సహాయం చేస్తు ప్రజల్లో కనిపించాడు.

రిమ్స్ ఆసుపత్రికి రూ.1.60 కోట్ల విలువైన పరికరాలు అందజేయబోతున్నట్టు విస్తృతంగా ప్రచారం చేయించారు. ఉట్నూర్, జైనూర్‌తోపాటు ఆదిలాబాద్‌లో డిజిటల్ మైక్రో ఫైనాన్స్ ఆఫీసులు ప్రారంభించాడు. డిజిటల్ మైక్రో ఫైనాన్స్ సంస్థలో పనిచేసేందుకు ఉద్యోగ ప్రకటన చేసి, మీటింగ్ ఏర్పాటు చేశాడు.
ఉద్యోగస్తులు వేసుకునే షూట్ బూటు ఐడి కార్డు కోసం ఒక్కొక్కరి వద్ద రూ.20,000 ఇవ్వాలని చెప్పాడు. దాదాపుగా 400 మందికిపైగా నిరుద్యోగుల నుంచి ఈ డబ్బులు తీసుకున్నారు. కొందరిని ఉద్యోగాల వంకతో చేర్చుకున్నాడు. కానీ శాలరీలు మాత్రమే ఇవ్వలేదు. నెల రోజుల నుంచి అందరు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అలసిపోయారు.

ఆదిలాబాద్‌లోని కార్యాలయంలో సంస్థలో ఉండే సిబ్బందిని పలువురు బాధితులు నిలదీశారు. క్రిష్ణకు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. సిబ్బంది మంగళవారం సాయంత్రం వేతనాలు చెల్లిస్తామని చెప్పి అదే రోజు సాయంత్రం నుంచి కార్యాలయాన్ని మూసేసి పత్తా లేకుండా పోయారు. దీంతో తాము మోసపోయినట్లు గ్రహించిన బాధితులు భారీ సంఖ్యలో ఆందోళన చేపట్టారు.

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ అఖిల్ మహాజన్‌కు ఫిర్యాదు చేశారు. తమను డిజిటల్ మైక్రో ఫైనాన్స్ సంస్థ నిండా ముంచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉట్నూరులోనూ బాధితులు సంస్థ కార్యాలయం వద్ద చేరుకొని ఆందోళన చేపట్టారు. చివరకు ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.






















