Nizamabad News : వానొచ్చెనంటే వరదొస్తది, ఆ కాలేజీ బంద్ అయితది!
Nizamabad News : వానాకాలం వచ్చిందంటే ఆ కాలేజీ విద్యార్థులు, సిబ్బందికి టెన్షన్. ఎప్పుడు చెరువు పొంగుతోందో నీళ్లు క్లాసుల్లోకి వచ్చేస్తాయో అని బిక్కుబిక్కుమంటూ క్లాసులకు వెళ్తుంటారు.
Nizamabad News : వానాకాలం వచ్చిందంటే నిజామాబాద్ జిల్లా నందిపేట్ పాలిటెక్నిక్ కాలేజీ స్టూడెంట్స్, సిబ్బందికి టెన్షన్ మొదలవుతుంది. వర్షం పడితే ఇక అంతే సంగతులు. విద్యార్థులు, అధ్యాపకుల్లో ఆందోళన మొదలవుతుంది. ఎప్పుడు వర్షం పడుతుందో, కాలేజీ ఎప్పుడు నీట మునుగుతుందోనని హైరానా పడుతుంటారు. చెరువు శిఖంను ఆనుకొని భవనం నిర్మించడమే ఇందుకు కారణం. చెరువులోకి వరద వస్తే చాలు కళాశాల భవనాలు ద్వీపాన్ని తలపిస్తాయి. ఏటా ఇదే సమస్య తలెత్తుతున్నా ప్రభుత్వం పరిష్కారమార్గం చూపడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో విద్యార్థులు తరగతులు నడవక నష్టపోతున్నారు. 2009లో ఈ కాలేజీ ప్రారంభమైంది. ఇక్కడ ఎలక్ట్రిషియన్ కమ్యూనికేషన్, మెకానికల్ ఇంజినీరింగ్ రెండు విభాగాలు ఉన్నాయి.
ఏటా జల దిగ్బంధం
ఈ కాలేజీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో కలిపి సుమారు 203 మంది విద్యార్థులు చదువుతున్నారు. వర్షకాలం వస్తే కాలేజీ వద్దకు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. నందిపేట్ మండల కేంద్రంలోని పడిగెల చెరువు శిఖం సమీపంలో పాలిటెక్నీక్ కాలేజీని నిర్మించారు. వరదలు వచ్చి చెరువులోకి నీరు చేరితే సమస్యలు తలెత్తుతాయని అంచనా వేయడంలో అప్పటి అధికారులు విఫలమయ్యారు. ఫలితంగా ఈ భవనాలు ఏటా జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. వర్షం వస్తే భవనాల చుట్టూ సుమారు 100 మీటర్ల మేర నీరు చేరుతోంది. కనీసం కాలేజీ దగ్గరకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. తరగతి గదుల్లోకి నీరు చేరుతోంది. కంప్యూటర్, ఇతర ల్యాబ్ ల్లోకి వరద చేరడంతో పరికరాలు చెడిపోతున్నాయి.
వర్షం వస్తే సెలవులే
ఇక వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. కొన్ని రోజుల పాటు గదుల్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు కట్ట తెగి నీరు బయటకు వెళ్తుంది. అయినా ఇంకా కళాశాల చుట్టూ నీరు నిల్వ ఉందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వానాకాలంలో ఎప్పుడు తరగతులు సాగుతాయో? ఎప్పుడు నిలిపేస్తారో ఎవరికీ తెలియదని విద్యార్థులు అంటున్నారు. వరద చెరువులోకి వస్తే, అవి బయటకు వెళ్లాలంటే వారం పది రోజులు పడుతుంది. అప్పటి వరకు సెలవులు ఇవ్వాల్సిందే. పాములు తరగతి గదుల్లోకి రావడం ఇక్కడ సర్వసాధారణం. విద్యార్థులు, అధ్యాపకులు పలుమార్లు సమస్యను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోయిందని అంటున్నారు.
Also Read : Weather Report: వచ్చే పదిరోజుల వరుణుడి టూర్ షెడ్యూల్ ఇదే! తెలుగు రాష్ట్రాలకు ముప్పు ఉందా!
Also Read : Nizamabad High Alert : నిజామాబాద్ జిల్లాకు పొంచి ఉన్న గండం - ప్రజలు ఈ జాగ్రత్తలు తీసుకోండి !