Nizamabad Rains : నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షాలు, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు, పొలాలు
Nizamabad Rains : నిజామాబాద్ జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. జిల్లాలో సోమవారం 24.6 మి.మీల వర్షపాతం కురిసింది. ఎస్సారెస్పీ 20 గేట్ల ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు.
Nizamabad Rains : నిజామాబాద్ జిల్లాలో వాన దంచి కొడుతోంది. వరస వర్షాలతో జనజీవనం అతాలాకుతలమవుతోంది. వాగులు పొంగి పొర్లడంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు జలకళ సంతరించుకుంది. జిల్లాలో వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయి. పొలాల్లో నీరు చేరడంతో పంటలు నీటమునిగాయి. జిల్లా వ్యాప్తంగా పాక్షికంగా ఇళ్లు దెబ్బతినగా పలు గ్రామాల పరిధిలో రోడ్లకు గండిపడ్డాయి. జిల్లాలో సోమవారం 24.6 మి.మీల వర్షం నమోదైంది. నవీపేట మండలంలో అత్యధికంగా 40.1 మి.మీల వర్షం పడింది. కాగా జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం ముంపు ప్రాంతాల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారిగా క్రిస్టినా జడ్ చోంగ్తూను నియమించింది. వరదలపై సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
శ్రీరామసాగర్ కు భారీగా వరద
శ్రీరామసాగర్‌లోకి మూడు నదులు, పరివాహక ప్రాంతాల ద్వారా ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చిచేరుతోంది. ప్రాజెక్టులోకి వస్తున్న వరద ఆధారంగా మరిన్ని గేట్లను పెంచారు. 20 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. వరద కాల్వ ద్వారా 11000 క్యూసెక్కుల నీటిని మిడ్‌మానేరుకు వదులుతున్నారు. ఎస్సారెస్పీలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి చేపట్టి 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1088.1 అడుగులు ఉన్నాయి. ప్రాజెక్టులో 90.325 టీఎంసీలకు గాను 76.743 టీఎంసీల నీళ్లు చేరాయి. ఎస్సారెస్పీ నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి 1983లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే జులై చివరి వారంలోనే నిండిన సంఘటనలు ఉన్నాయి. ప్రాజెక్టు గేట్లను జులై చివరి వారంలో ఎత్తారు. ఈ సంవత్సరం మాత్రం భారీగా వరద రావడంతో జులై 10నే ప్రాజెక్టు గేట్లను తెరచి దిగువకు నీటి విడుదల చేశారు.
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ జెన్కో లో విద్యుత్ ఉత్పత్తి
ఎస్సారెస్పీకి భారీ వరదలు వచ్చి గేట్లు ఎత్తడంతో జెన్‌కో ఆధ్వర్యంలో విద్యుత్ ఉత్పత్తి మొదలుపెట్టారు. ఎస్సారెస్పీ వద్ద ఉన్న జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మూడు యూనిట్లను ఉపయోగిస్తూ విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. మూడు యూనిట్ల ద్వారా 25 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ట్రాన్స్‌పోర్ట్ సరఫరా చేస్తున్నారు. మరొక యూనిట్ మరమ్మతులు కొనసాగుతుండడంతో వారం రోజుల్లో పూర్తిచేసి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్సారెస్పీ వద్ద 1987లో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మొత్తం 4 యూనిట్లను ఏర్పాటుచేశారు. ఒక్కో యూనిట్ ద్వారా 9 మెగావాట్లను ఉత్పత్తి చేసేవిధంగా టార్బైన్‌లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అప్పటి నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు
కామారెడ్డి జిల్లాలోనూ 3 రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. జనజీవనం స్తంభించింది. వాగులు వంకలు పోoగిపొర్లుతున్నాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో రహదారులు తెగిపోయాయి. రాకపోకలు అంతరాయం కలిసింది. జిల్లాలో సింగీతం, కళ్యాణి, కౌలాస్ నాలా, పోచారం ప్రాజెక్ట్ లు పూర్తిగా నిండాయి. కౌలాస్ నాలా గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. వర్షాలు విస్తారంగా కురవడంతో ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకోవటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరో మూడు రోజులు వర్షాలు
మరో 3 రోజులు జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారానికి 24 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావాలని సూచిస్తున్నారు అధికారులు. నిజామాబాద్ లో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు అధికారులు. నగరంలోని గూపన్ పల్లి లో పునరావాసం ఏర్పాటు చేశారు.