Cheetah Attack : నిజామాబాద్ జిల్లాలో బైక్ ను వెంబడించిన చిరుత, యలమంచిలి వాసుల్ని భయపెడుతోన్న పెద్దపులి
Cheetah Attack : నిజామాబాద్ జిల్లాలో బైక్ ను చిరుత వెంబడించింది. అలాగే అనకాపల్లి జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతోంది. పెద్దపల్లి-కొక్కిరాపల్లి రిజర్వు ఫారెస్ట్ పరిసరాల్లో పులి సంచారిస్తున్న అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు.
![Cheetah Attack : నిజామాబాద్ జిల్లాలో బైక్ ను వెంబడించిన చిరుత, యలమంచిలి వాసుల్ని భయపెడుతోన్న పెద్దపులి Nizamabad Cheetah trying to attack Biker Anakapalli tiger pug marks identified Cheetah Attack : నిజామాబాద్ జిల్లాలో బైక్ ను వెంబడించిన చిరుత, యలమంచిలి వాసుల్ని భయపెడుతోన్న పెద్దపులి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/d33d15d5ba63186e76b6bc2b695b165f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cheetah Attack : అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దపల్లి-కొక్కిరాపల్లి రిజర్వు ఫారెస్ట్ పరిసరాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్టు శనివారం అటవీ శాఖాధికారులు వెల్లడించారు. పులి సంచరించిన ప్రాంతాన్ని డీఎఫ్‌ఓ అనంత శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం కురిసిన వర్షం కారణంగా నేలపై పులి సంచరించిన ప్రదేశంలో కాలి ముద్రలు స్పష్టంగా కనిపించాయని తెలిపారు. పెద్దపల్లి, మంత్రిపాలెం, గొల్లలపాలెం, కొక్కిరాపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లోనే పులి సంచరిస్తున్నట్టు పేర్కొన్నారు. పులికి ఎదురుతిరగడం, చప్పుళ్లు చేయడం వంటి పనులు ఎవ్వరూ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. పులి కదలికలను గుర్తించడానికి ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పులి సంచారం విషయం తెలిసి యలమంచిలి మండల వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పొలాల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో చిరుత కలకలం
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం డికంపల్లి శివారులో చిరుత కలకలం రేపుతోంది. రామస్వామి క్యాంపునకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రాజు ఆదివారం రాత్రి మాక్లూర్ మండలం గాంధీనగర్ కు వెళ్లి తిరిగి వస్తుండగా, సుమారు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో చెట్ల పొదలలో నుంచి చిరుత రాజు ప్రయాణిస్తున్న బైక్ పై పంజా విసిరింది. రాజు తో పాటు ప్రయాణిస్తున్న అజయ్ తో కలిసి ఇద్దరు గట్టిగా కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. దీంతో వీరు తప్పించుకొని గ్రామానికి చేరుకున్నారు. అనంతరం మాక్లూర్ పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటనను పోలీసులకు వివరించారు. అధికారులు చిరుతను పట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఎలుగుబంటి దాడి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎలుగుబంట్లు హల్ చల్ చేస్తున్నాయి. జిల్లాలో ఏదోక ప్రాంతంలో మనుషులపై దాడులకు తెగబడుతున్నాయి. ఇటీవల కంబదూరు మండలం ఎర్రబండ గ్రామంలో ఒక మహిళపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున మహిళ బహిర్భుమికి వెళ్తోన్న సమయంలో మహిళపై ఎలుగుబంటి దాడికి దిగింది. దీంతో మహిళ బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. వారంతా గట్టిగా కేకలు వేయడంతో ఎలుగుబంటి కొండ ప్రాంతం వైపు పారిపోయింది. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సమాచారం అందుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రామేశ్వరమ్మ కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మహిళ పరామర్శించారు. బాధిత మహిళ నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. బాధిత మహిళకు పరిహారం అందేలా చూస్తామని ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)