Minister Indrakaran Reddy : పురాతన ఆలయాలకు పూర్వ వైభవం, రూ.10 కోట్లతో అడెల్లి పోచమ్మ ఆలయం పునర్నిర్మాణం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Minister Indrakaran Reddy : రాష్ట్రంలో పురాతన ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రూ.10 కోట్లతో అడెల్లి పోచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
Minister Indrakaran Reddy : సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలోని పురాతన ఆలయాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం రూ. 10 కోట్ల నిధులతో అడెల్లి పోచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆలయ నిర్వాహకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి లాంచనంగా నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆలయాలతో ఆధ్యాత్మికత పెంపొందిస్తున్నామన్నారు. ఇప్పటికే ఎన్నో ఆలయాలను అభివృద్ధి చేశామని, నూతన దేవాలయాలను నిర్మిస్తున్నామని చెప్పారు. అడెల్లి పోచమ్మ దేవాలయాన్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామిగా ఇష్ట దైవమైన అడెల్లి పోచమ్మ గుడి పునర్నిర్మాణ పనులను ప్రారంభించుకోవడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు.
రూ.10 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం
ఆలయ ప్రాంగణం చిన్నదిగా ఉండటంతో భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆలయ పునర్నిర్మాణం చేపట్టామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. రూ.10 కోట్లతో అడెల్లి పోచమ్మ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. యాదాద్రి తరహాలో కృష్ణ శిలలతో నిర్మించే విధంగా మాస్టర్ ప్లాన్ ను రూపొందించామని వెల్లడించారు. గర్భాలయంలోని అమ్మవారి విగ్రహం మినహా దేవాలయాన్ని పూర్తిగా నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. రూ.6.60 కోట్లతో గర్భగుడి, అర్థ మండపం, అనివేటి మండపం నిర్మాణం, రూ.1 కోటితో రాజగోపురం, రూ. 60 లక్షలతో ఆలయ ప్రాంగణం చుట్టూ ప్లోరింగ్, రూ. 40 లక్షలతో భక్తుల కోసం వసతి గృహాలు (షేడ్స్), రూ. 40 లక్షలతో కోనేరు ఆధునీకరణ, రూ.1 కోటితో 100 దుకాణాలు నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
600 ఆలయాల అభివృద్ధి
ఆలయానికి 24 గంటలు నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేసేందుకు ప్రత్యేక విద్యుత్ లైన్, మిషన్ భగీరథ ద్వారా నీటిని అందిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. తొమ్మిది నెలలలో ఆలయాన్ని పూర్తి చేసేలా ప్రణాళికలు తయారు చేశామని తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రిగా తన స్వంత నియోజక వర్గమైన నిర్మల్ లో 600 ఆలయాలను అభివృద్ధి చేశామని తెలిపారు. సారంగపూర్ మండలంలో సబ్ స్టేషన్లు, చెక్ డ్యామ్ లు పూర్తి చేస్తునట్లు తెలిపారు. బోథ్ వయా దన్నూర్ నుంచి అడెల్లి వరకు రూ.10 కోట్లతో రహదారి నిర్మాణం పూర్తి కావచ్చిందన్నారు. రూ. 6.60 కోట్లతో ఆదిలాబాద్ మొండిగుట్ట రోడ్డు నిర్మాణం చేపడుతామని తెలిపారు. అంతకు ముందు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
Also Read : BJP Plan : వేరే పనుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ - మునుగోడు షెడ్యూల్ బీజేపీకి అడ్వాంటేజ్ ?