Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మరడం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Minister IK Reddy : కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్ విసిరారు. ఉద్యోగాల నియామకాల్లో ఆరోపణలు కాదు, ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు.
Minister IK Reddy : మున్సిపల్ ఉద్యోగాల నియమాకాల్లో తనపై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. నిరాధార ఆరోపణలు చేయడం కాదని, ఆధారాలుంటే బయటపెట్టాలని సవాలు విసిరారు. అసత్య ప్రచారం చేస్తున్నందుకు పోలీసులు మహేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేశారని స్పష్టం చేశారు. పోలీసులు ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారని, ఆరోపణలకు రుజువులు చూపాలన్నారు. తప్పు చేస్తే చట్ట ప్రకారం ఎలాంటి శిక్షకైనా తను సిద్ధమని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి పనైపోయిందని, రేపో మాపో ఆయన పార్టీ మారుడు ఖాయమన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తే మహేశ్వర్ రెడ్డి, ఆ పార్టీ కార్యకర్తలు స్పందించలేదని ఆరోపించారు. మహేశ్వర్ రెడ్డిపై పోలీసుల కేసు నమోదు చేస్తే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తే.... మొదటి స్పందించింది బీఆర్ఎస్ పార్టీయేనని, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం నిస్సహాయ స్థితిలో ఉందని వ్యాఖ్యానించారు.
మోయలేని భారంగా ఎల్పీజీ
నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా ఇన్ ఛార్జ్ గంగాధర్ గౌడ్, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలిరావడంతో మామడ మండల కేంద్రం అంతా గులాబీమయంగా మారింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... నాయకులు, కార్యకర్తలందరూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ప్రజల గురించి ఎంతో గొప్పగా ఆలోచించే వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండటం మన అందరి అదృష్టమన్నారు. కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేసి మరోసారి పార్టీకి అఖండ విజయం అందించాలని కోరారు.
సంక్షేమ పాలన
రైతు సంక్షేమ పథకాలతో గత తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో వరిసాగు రెట్టింపు అయ్యిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ప్రతినెలా పెన్షన్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డలకు పెండ్లి కానుక కేసీఆర్ ప్రభుత్వమే ఇస్తోందని తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. రైతుల, సామాన్య ప్రజల ఆదాయాన్ని పెంచేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుండగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని వస్తువుల ధరలను పెంచుతూ.. సామాన్యులపై మోయలేని భారాన్ని మోపుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రజలు ఇబ్బందులకు గురికావొద్దనే ఉద్దేశంతో ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్లు అందజేసి కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగిస్తే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పేద కుటుంబాలు సిలిండర్ వెలిగించి వంట చేయాలంటేనే భయపడుతున్నారని చెప్పారు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.