Jublihills Congress Candidate: జూబ్లిహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌కే చాన్స్ - ఇతర నేతల్ని ఎలా బుజ్జగిస్తారు?
Naveen Yadav: జూబ్లిహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఎక్కువగా ప్రచారంలోకి వస్తోంది. ఇతర పోటీ దారుల్ని బుజ్జగించడమే కాంగ్రెస్ పార్టీకి పెద్ద టాస్క్ గా మారే అవకాశం ఉంది.

Naveen Yadav to be Congress candidate: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి ఎంపిక ఆలస్యమవుతోంది. ఉపఎన్నికపై చర్చించేందుకు, అభ్యర్థిని ఖరారు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి .. పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో సమావేశం అయ్యేందుకు బెంగళూరు వెళ్లారు. యాదవ్ సామాజికవర్గానికి టిక్కెట్ కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు. గతంలో మజ్లిస్ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన నవీన్ యాదవ్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన వైపు రేవంత్ మొగ్గు చూపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
నవీన్ యాదవ్ పేరుకే ప్రాధాన్యం ఇచ్చిన ముగ్గురు మంత్రుల కమిటీ
మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు మూడు రోజులు స్థానిక నేతలు, కార్యకర్తలతో చర్చలు జరిపి నాలుగు పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు. వారిలో ప్రధానంగా బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్ పేర్లు ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. నవీన్ యాదవ్ కుటుంబానికి స్థానికంగా పట్టు ఉంది. చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడిగా ఆయన నియోజకవర్గంలో కీలకంగా ఉంటారు. మజ్లిస్ తరపున నవీన్ యాదవ్ ఓ సారి పోటీ చేశారు. 2014లో మజ్లిస్ తరపున పోటీ చేసి .. 9వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2019లో బీఆర్ఎస్ తో అవగాహన కారణంగా మజ్లిస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. సొంత బలంతోనే మూడో స్థానంలో నిలిచారు. 2023లోనూ అదే అవగాహన కొనసాగడంతో మజ్లిస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు రేవంత్ ఆయన కుటుంబం మాస్ పవర్ పై నమ్మకంతో వారికే టిక్కెట్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
వ్యక్తిగతంగా కూడా బలమున్న నవీన్ యాదవ్
అభ్యర్థిత్వం కోసం మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. యాదవ సామాజికవర్గానికి ఇవ్వాలంటే తనకే ఇవ్వాలంటున్నారు. అయితే ఆయన స్థానికుడు కాదు. పాతబస్తీకి చెందిన నేత కావడంతో జూబ్లిహిల్స్ లో టిక్కెట్ ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు. మరికొంత మంది టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నా.. స్థానకి బలం.. వ్యక్తిగత బలం అన్నీ కలసి వచ్చి నవీన్ యాదవే అందరికీ కనిపిస్తున్నారు.
రేవంత్ కూడా నవీన్ యాదవ్ వైపే - ఇతర ఆశావహుల్ని ఎలా బుజ్జగిస్తారు?
జూబ్లిహిల్స్ ఉపఎన్నిక.. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ కు చాలా ముఖ్యం. ఉపఎన్నికల్లో గెలిస్తే.. ప్రజాభిప్రాయం.. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందని అనుకుంటారు. లేకపోతే.. వ్యతిరేకత ప్రారంభమయిందని చెప్పుకుంటారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే అభ్యర్థి ఎంపిక విషయంలో హైకమాండ్ కు తన అభిప్రాయం స్పష్టంగా చెప్పి.. నవీన్ యాదవ్ పేరును ఖరారు చేయించాలని ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ ఇప్పటికే మాగంటి సునీత పేరును ఖరారు చేసింది. ఆమె ప్రచారం చేసుకుంటున్నారు. నవీన్ యాదవ్ కూడా బస్తీల్లో ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు.





















