Jubilee Hills Bypoll 2025 Date:జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు మోగిన నగరా - పోలింగ్ సహా పూర్తి షెడ్యూల్ ఇదిగో !
Jubilee Hills By-election 2025 Date:జూబ్లిహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు జూబ్లీహిల్స్ సహా చాలా ఉపఎన్నికలు నిర్వహిస్తోంది.

Jubilee Hills By-election 2025 Date: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికకు ఎన్నికల కమిషన్ (ఈసీఐ) షెడ్యూల్ ప్రకటించింది. బిహార్ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా ఖాళీ అయిన పలు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. అందులో తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది. ఇక్కడ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పూర్తి షెడ్యూల్ ఇదే
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడు:- 13 అక్టోబర్ 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్‌కు తుది గడువు:- 21-10-2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ స్క్రూట్నీ ఎప్పుడు:-22-10-2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ ఉపసంహరణ ఎప్పుడు:- 24-10-2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ఎప్పుడు:-11-11-2025
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 8జూన్ 2025న మరణించడంతో ఖాళీ అయిన సీటుకు ఇప్పుడు ఉపఎన్నిక జరగనుంది. ఇప్పటికే పార్టీలు అభ్యర్థులు ఎంపిక చేస్తున్న మధ్య, ఎన్నికల సంఘం బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ షెడ్యూల్‌ను ప్రకటించనుంది. జూబ్లీహిల్స్, హైదరాబాద్‌లోని ప్రముఖ రెసిడెన్షియల్ ప్రాంతం, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగం. ఈ ఉపఎన్నికలో 3.92 లక్షల మంది ఓటర్లు తమ హక్కు ఉపయోగించుకోవచ్చు. డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేసిన ఎన్నికల అధికారులు, క్లెయిమ్స్ & ఆబ్జెక్షన్స్‌ను సెప్టెంబర్ 25 వరకు స్వీకరించారు. ఫైనల్ ఎలక్టరల్ రోల్ సెప్టెంబర్ 30న ప్రచురించారు.
అగస్టు 20 నాటి డ్రాఫ్ట్ ప్రకారం పురుషులు 2.04,167, మహిళలు 1,88,213 మంది. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 25 మంది. ప్రత్యేక అవసరాలతో ఉన్న (పీడబ్ల్యూడీ) ఓటర్లు 1,858 మంది, 80 ఏళ్లు పైబడినవారు 6,049 మంది. జెండర్ రేషియో 920:1000. సర్వీస్ వోటర్లు 18 మంది, ఎన్‌ఆర్‌ఐలు 96 మంది. తుది జాబితాలో 3.99 లక్షలకు పెరిగినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఓటర్లు తమ పేరు లిస్ట్‌లో ఉందో తనిఖీ చేసుకోవాలని ఈసీఐ పిలుపునిచ్చింది. ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లు, ఫారం-7 ద్వారా తొలగింపు, ఫారం-8 ద్వారా సవరణలు చేసుకోవచ్చు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 407 పోలింగ్ బూతులు 139 లొకేషన్లలో ఏర్పాటు చేశారు. ఇందులో 183 బూతుల్లో 1,200 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారు. అయితే, ఏ బూతులోనూ 1,500 మందికి మించి ఓటర్లు ఉండకుండా రేషనలైజేషన్ పూర్తి చేశారు. ప్రతి బూతు ఓటర్ నివాసానికి 2 కి.మీ. దూరంలో ఉండేలా చూశారు. బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓలు) 3,500 మంది శిక్షణ పొందారు. మొబైల్ ఫోన్లు బూతు వెలుపల డిపాజిట్ చేయాలి. ఈసీఐ కొత్త యాప్‌లు, ఈసీఐనెట్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఉపయోగించి పారదర్శకత పెంచారు.
ఈ ఉపఎన్నిక జకీయాల్లో ప్రతిష్టాత్మకమైనది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలిచారు. మహ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని ప్రయత్నిస్తోంది. జూబ్లిహిల్స్ లో ముక్కోణపు పోటీ జరగనుంది.
భవిష్యత్ ప్రభావం
ఈ ఉపఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో కీలకమవుతుంది. కాంగ్రెస్ గెలిస్తే, GHMC ఎన్నికల్లో బలం పెరుగుతుంది. బీఆర్ఎస్ లేదా బీజేపీ గెలిస్తే, రెవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. ఓటర్లు ఈ ఎన్నికలో పాల్గొనాలని, తమ ఓటర్ ఐడీలు, వివరాలు తనిఖీ చేయాలని ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. ఎక్కువ వివరాలకు ceotelangana.nic.in వెబ్‌సైట్ చూడండి లేదా స్థానిక బూత్ లెవల్ అధికారిని సంప్రదించండి.





















