Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Telangana News: తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం కేసును విచారించిన న్యాయస్థానం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
Nampally Court Summons To Minister Konda Surekha: రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు (Minister Konda Surekha) నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో ఆమెకు గురువారం నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసిన న్యాయస్థానం.. ఆ రోజున జరిగే విచారణకు హాజరు కావాలని మంత్రిని ఆదేశించింది. కాగా, అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లోనూ పెను దుమారం రేపాయి. మంత్రి వ్యాఖ్యలపై నటుడు నాగార్జున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రి వ్యాఖ్యానించారంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.
'ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు'
విచారణ సందర్భంగా నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు.. నాగార్జున కుటుంబంపై మంత్రి సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని.. ఆ తర్వాత 'ఎక్స్'లో క్షమాపణ కోరుతూ పోస్ట్ పెట్టారన్నారు. ఈ మేరకు ఆమె పెట్టిన పోస్టును చదివి వినిపించారు. 'బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. కచ్చితంగా ఆమె క్రిమినల్ చర్యలకు అర్హురాలు. ఈ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం ఎంతో కుంగిపోయింది.' అని వాదించారు. అంతకు ముందు.. కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్.. మంత్రి క్షమాపణలు చెప్పినట్లుగా కౌంటర్ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మంత్రికి సమన్లు జారీ చేస్తూ డిసెంబర్ 12న విచారణకు రావాలని ఆదేశించింది.
Also Read: Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు