Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Tenth Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షల విధానంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఇకపై ఫైనల్ పరీక్షలు 100 మార్కులకు నిర్వహించనున్నట్లు విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Government Changes In 10th Marks System: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు (Tenth Students) బిగ్ అలర్ట్. పదో తరగతి మార్కుల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం టెన్త్‌లో ఇంటర్నల్ మార్కులు 20, ఫైనల్ పరీక్షలు 80 మార్కులకు నిర్వహిస్తున్నారు. ఈసారి ఇంటర్నల్ మార్కుల (Internal Marks) విధానాన్ని సర్కారు పూర్తిగా రద్దు చేసింది. ఇకపై ఫైనల్ పరీక్షలు 100 మార్కులకు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షల విధానంలో స్వల్ప మార్పులు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానం 2024 - 25 విద్యా సంవత్సరం నుంచే అమలు కానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇకపై విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్స్ ఇవ్వాలని నిర్ణయించింది. కాగా, ఇంటర్నల్ మార్కుల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతోనే విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.
పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలివే..
మరోవైపు, పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజుల స్వీకరణ కొనసాగుతోంది. డిసెంబర్ 2వ తేదీ వరకూ రూ.50 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించుకోవచ్చు. రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12 వరకూ.. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21వ తేదీ వరకూ ఫీజు చెల్లించొచ్చు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ.125 ఫీజు చెల్లించాలి. 3 పేపర్ల లోపు ఉంటే రూ.110, 3 పేపర్ల కంటే ఎక్కువ బ్యాకలాగ్స్ ఉన్న విద్యార్థులు రూ.125 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాలి. పూర్తి వివరాలకు https://www.bse.telangana.gov.in/ సైట్‌లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఆన్‌లైన్‌లోనూ ఫీజు చెల్లింపు
అటు, ఫీజు చెల్లింపులకు సంబంధించి ఇబ్బందులను పరిష్కరించేలా ప్రభుత్వ పరీక్షల విభాగం చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌లోనే పరీక్షల ఫీజు చెల్లించేలా ఆప్షన్ తీసుకొచ్చింది. విద్యార్థులు ఫీజును పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి చెల్లించాలి. వారు వారికి కేటాయించిన వివరాల ద్వారా లాగిన్ అవుతారు. నేరుగా ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లిస్తారు. ఫీజు చెల్లించిన 24 గంటల్లోపు స్టేటస్ అప్ డేట్ అవుతుంది. https://bse.telangana.gov.in/SSCADMFRFY/Account/Login.aspx పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజుల చెల్లింపుల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించేలా పరీక్షల విభాగం మరికొన్ని చర్యలు చేపట్టింది. జిల్లాల వారీగా ప్రత్యేకాధికారులను నియమించడం సహా హెల్ప్ లైన్ నెంబర్లను సైతం తీసుకొచ్చింది.