Numaish 2022: ఈ నెల 25 నుంచి నుమాయిష్ ప్రారంభం, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ రెడీ
హైదరాబాద్ లో నుమాయిష్ తిరిగి ప్రారంభకానుంది. కరోనా కారణంగా నిలిచిపోయిన నుమాయిష్ ను ఫిబ్రవరి 25 నుంచి తిరిగి ప్రాంభిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది.
తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) తిరిగి ప్రారంభం కానుంది. నుమాయిష్(Numaish) ను ప్రారంభిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 1న ప్రారంభమయిన నుమాయిష్ 45 రోజుల పాటు కొనసాగాల్సి ఉంది. కానీ ఒమిక్రాన్ వ్యాప్తి, కరోనా థర్డ్ వేవ్(Corona Third Wave) కారణంగా నుమాయిష్‌ను నిలిపివేయాలని ఎగ్జిబిషన్ సొసైటీకి పోలీసులు సూచించారు. దీంతో నుమాయిష్ నిలిచిపోయింది. రాష్ట్రంలో థర్డ్ ముగిసిందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా కేసులు తగ్గి పరిస్థితులు అదుపులోకి రావటంతో ఈనెల 25 నుంచి నుమాయిష్ తిరిగి ప్రారంభించాలని ఎగ్జిబిషన్ సొసైటీ(Exihibition Society) నిర్ణయం తీసుకుంది. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు నుమాయిష్ నిర్వహిస్తామన్నారు. వారాంతాల్లో మరో అరగంట పొడిగించి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. నుమాయిష్ తిరిగి ప్రారంభంకాబోతుండడంతో హైదరాబాద్ నగరవాసులు, వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది జనవరి 1వ తేదీన 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. కానీ కరోనా వైరస్(Corona Virus) విజృంభించిన కారణంగా నుమాయిష్‌ను రద్దు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్(Hyderbad Police Commissioner) ఎగ్జిబిషన్ సొసైటీకి సూచించారు. దీంతో నుమాయిష్ ను రద్దు చేశారు. ప్రతి రోజూ దాదాపు 45,000 మంది సందర్శకులు వచ్చే ఈ ఎగ్జిబిషన్‌లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రతి ఏడాది నుమాయిష్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహిస్తారు. 2019లో 20 లక్షల మందికి పైగా ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అయితే 2021లో నుమాయిష్ ఎగ్జిబిషన్ ను కరోనా కారణంగా రద్దు చేశారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ కు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల(Twin Cities) నుండి మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి పొరుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు.
1938లో స్థానికంగా ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రోత్సహించేందుకు నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. కేవలం 50 స్టాల్స్‌తో ప్రారంభిమైన ఈ ఎగ్జిబిషన్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనలలో ఒకటిగా నిలుస్తోంది. హైదరాబాద్ స్టేట్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మొదటి నుమాయిష్‌ను ప్రారంభించారు. అనంతరం నుమాయిష్ ఎగ్జిబిషన్(Numaish Exihibition) కు ఆదరణ పెరిగింది. స్థానిక పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, హోటళ్లు, ఫుడ్ కోర్ట్(Food Court)లతో పాటు దేశంలోని వ్యాపారులు నుమాయిష్ లో స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు ప్రజలకు చేరువయ్యేందుకు ఎగ్జిబిషన్ ను ఒక వేదికగా ఉపయోగపడుతుంది. 1949లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌గా దీని పేరు మార్చారు. అప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా సి. రాజగోపాలాచారి(C.Rajagopalachari) ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎంతో ప్రజాదరణ పొందింది. కరోనా కారణంగా రెండేళ్లుగా నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు నిర్వహణలో అవంతరాలు వస్తున్నాయి.