TRS Rajya Sabha Seat: మాజీ ఎంపీ పొంగులేటికి టీఆర్ఎస్ రాజ్యసభ ఛాన్స్ ! కేటీఆర్ నుంచి పిలుపు రావడంతో అనుచరుల్లో జోష్ !
TRS Rajya Sabha Seat: రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ సీటు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో అసంతృప్త నేతగా ఉన్న పొంగులేటికి దక్కుతుందని జిల్లాలో వినిపిస్తోంది.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ సభ్యుడు (ఎంపీ)గా పదవి దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ సీటు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో అసంతృప్త నేతగా ఉన్న పొంగులేటికి దక్కుతుందని జిల్లాలో వినిపిస్తోంది. ఈ మేరకు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నుంచి ఫోన్ వచ్చిందనే ప్రచారం సాగుతున్నప్పటికీ ఈ విషయంపై అటు పార్టీ వర్గాలు కానీ, పొంగులేటి కానీ నిర్ధారణ చేయడం లేదు. అయితే ఇప్పటి వరకు పలుమార్లు పొంగులేటికి పదవులు దక్కుతాయని ప్రచారం సాగినప్పటికీ అవి కేవలం ప్రచారం వరకే పరిమితమయ్యాయి.
వైఎస్సార్‌సీపీతో ప్రభావం..
2014 ఎన్నికల్లో తెలంగాణలో చర్చానీయాంశంగా మారిన పొంగులేటి ఆ తర్వాత క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయినట్లు కనిపించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించడంతోపాటు తాను ఎంపీగా గెలిచి తెలంగాణలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. అప్పట్లో వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పొంగులేటి 2012లో పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ పార్టీలో సైతం తన దైన శైలిలో బలమైన వర్గాన్ని ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాల కారణంగా 2018లో సొంత పార్టీ నేతల ఓటమికి కారణమయ్యారనే ఆరోపణల నేపథ్యంలో 2019లో సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అప్పట్నుంచి పొంగులేటి పార్టీ మారుతారనే ప్రచారం సాగినప్పటికీ అధికార టీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో జోరు పెంచిన పొంగులేటి..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీకి ఇప్పుడు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కేంద్ర బిందువుగా మారారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా లేరు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఎదిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరుచూ జిల్లా పర్యటనలు చేయడంతోపాటు సొంత క్యాడర్‌కు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. పార్టీలో ప్రాధాన్యత తగ్గిందనే ప్రచారంతోపాటు ఆయనతోపాటు వెన్నంటి ఉన్న కొందరు కీలక నేతలు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు సన్నిహితంగా మారారు. ఈ నేపథ్యంలో గత ఏడాది రాజ్యసభకు ఎంపిక అవుతాడని ప్రచారం జరిగినప్పటికీ అది కూడా దక్కలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో భర్తీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో పొంగులేటికి తప్పకుండా అవకాశం దక్కుతుందని ప్రచారం జరిగినప్పటికీ అది కూడా జరగలేదు. ఇప్పటికే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించడంతో ఈ సారి కూడా పొంగులేటికి అవకాశం లబించలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఎదిగిన పొంగులేటికి టీఆర్‌ఎస్ పార్టీలో సరైన ప్రాదాన్యత లభించడం లేదని ఆయన అనుచరులు నిరాశకు లోనైనట్లు కనిపిస్తున్నారు.
రాజ్యసభకు పంపకపోతే..?
అయితే మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీగా ఉండి సీటు రాకపోయినా నాలుగేళ్లపాటు పార్టీలో ఉంటున్న మాజీ ఎంపీ పొంగులేటి ఈ సారి రాజ్యసభకు ఎంపిక కాకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఇప్పటికే గత రెండేళ్లుగా పొంగులేటి పార్టీ మార్పుపై సామాజిక మాద్యమాల్లో విస్తృత ప్రచారం సాగుతుంది. అయితే పొంగులేటి మాత్రం ఉమ్మడి జిల్లాలో తన అనుచరులను కాపాడుకుంటూ ఓదార్పు యాత్రలతో ఉమ్మడి జిల్లాను చుట్టేస్తున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పొంగులేటి రాజ్యసభ దక్కుతుందా..? ఒకవేళ అది జరగకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.