Telangana Congress News: అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ.. మంత్రుల మధ్య ముగిసిన వివాదం
Ponnam Prabhakar | అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ.. మంత్రుల మధ్య ముగిసిన వివాదం

TPCC Chief Mahesh Kumar Goud | హైదరాబాద్: తెలంగాణలో రెండు రోజులుగా ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య నెలకొన్న అనుచిత వ్యాఖ్యల వివాదం ముగిసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం నాడు తన నివాసంలో ఇద్దరు మంత్రులతో సమావేశమయ్యారు. తనకు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాకు పార్టీ సంక్షేమం తప్ప మరో దురుద్దేశం లేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. అయితే తాను ఆ మాట అనకపోయినా మీడియాలో వచ్చిన కథనాలతో ఆయన బాధ పడ్డారు, కనుక అందుకు అడ్లూరి లక్ష్మణ్‌కు పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు. తనకు అలాంటి ఆలోచన లేదు.. ఆ ఒరవడి లో పెరగలేదని, కాంగ్రెస్ పార్టీ ఆ సంస్కృతి నేర్పలేదు అన్నారు.
అడ్లూరి లక్ష్మణ్‌కు పొన్నం ప్రభాకర్ క్షమాపణ
సామాజిక న్యాయానికి పోరాడే సందర్భంలో వ్యక్తిగత అంశాలు పక్కన ఉంచుతాం. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంలో బలహీనవర్గాల బిడ్డగా రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో రాహుల్ గాంధీ సూచన మేరకు 42 శాతం రిజర్వేషన్ల కోసం మా పోరాటం జరుగుతుంది. మేమంతా ఐక్యంగా భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పని చేస్తాం. అడ్లూరి లక్ష్మణ్ కి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్తున్న.. కరీంనగర్ లో మాదిగ సామాజిక వర్గం మేమంతా కలిసి పెరిగాం. ఆ అపోహ ఉండవద్ధని విజ్ఞప్తి చేస్తున్న’ అని పొన్నం ప్రభాకర్ అన్నారు.
ఈ భేటీలో మంత్రి వాకిటి శ్రీహరి,ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, శివసేన రెడ్డి ,సంపత్ కుమార్, అనిల్ ,వినయ్ కుమార్ పాల్గొన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు మంత్రులను సమన్వయ పరిచారు. మంత్రుల మధ్య ఏర్పడ్డ అభిప్రాయ బేధాలను సరిదిద్దడంతో వివాదం సద్దుమణిగింది. తాను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, అయితే తన మాటలకు నోచ్చుకున్నారని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
అడ్లూరి లక్ష్మణ్ నాకు సోదరుడిలాంటివారు.. పొన్నం ప్రభాకర్
ఉదయం పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటన చేశారు. ‘మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నాకు సోదరులవంటివారు. కాంగ్రెస్ లో మాకు 30 సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించినది. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడూ అలాగే ఉంటాయి. నేను అడ్లూరి లక్ష్మణ్ పై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నేతనైన నాకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదు.
రాజకీయ దురుద్దేశంతో కొంతమంది నా వ్యాఖ్యలను వక్రీకరించి, వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేసి చూపారు. దాంతో ఏర్పడిన అపార్థాల వల్ల అన్నలాంటి వ్యక్తి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మనసు నొచ్చుకుందని తెలిసి తీవ్రంగా విచారిస్తున్నాను. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మనసు నొచ్చుకొని ఉంటే అందుకు చింతిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం సాధనలో మేము ఇద్దరం కలిసికట్టుగా కృషి చేస్తామని’ పొన్నం ప్రభాకర్ అన్నారు.






















