(Source: ECI/ABP News/ABP Majha)
Suryapet: సూర్యాపేట ‘జై భీమ్’ ఘటనలో SIపై వేటు.. ఆయన ట్రాక్ రికార్డ్ అంతా ఇంతే! ఎస్పీ ఉత్తర్వులు
ఈ ఎస్సై ఎస్.లింగం యాదవ్ ట్రాక్ రికార్డు కూడా వివాదాస్పదంగానే ఉంది. ఈయన గతంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తించారు.
సూర్యాపేట జిల్లాలో ఓ గిరిజన యువకుడిని పోలీసులు తీవ్రంగా చితకబాదిన ఘటనలో ఎస్సైపై వేటు పడింది. ఆత్మకూర్ ఎస్సై ఎస్.లింగం యాదవ్‌ను వీఆర్‌కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆదేశించారు. ఇందులో భాగంగా సూర్యాపేట డీఎస్పీ మోహన్ కుమార్ ఈ వ్యవహారంపై విచారణ కూడా జరుపుతున్నారు. ఈ విచారణ పూర్తయ్యాక ఎస్.లింగంపై పూర్తి స్థాయి చర్యలు తీసుకొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
అయితే, ఈ ఎస్సై ఎస్.లింగం యాదవ్ ట్రాక్ రికార్డు కూడా వివాదాస్పదంగానే ఉంది. ఈయన గతంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో కూడా ఈయన సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత పని చేసిన సూర్యాపేట పీఎస్‌లో కూడా వివాదాస్పదంగా వ్యవహరించడంతో వీఆర్‌కు ఎటాచ్ అయ్యారు. ఆ తర్వాత పోస్టింగ్ ఆత్మకూర్ పీఎస్‌కు వచ్చింది. ఇప్పుడు కూడా దిగువ సామాజిక వర్గానికి చెందిన యువకుడిని చితకబాదడంతో ఈయన వ్యవహారం చర్చనీయాంశం అయింది. తాజా ఘటనతో జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. దీంతో మళ్లీ వీఆర్‌కు ఎటాచ్ చేశారు.
ఏం జరిగిందంటే..
గతేడాదిగా ఆత్మకూరు(ఎస్) మండలంలో ఎస్సారెస్పీ కాలువపై రైతులు తమ పంట పొలాల కోసం విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి వ్యవసాయ పనిముట్లు, మోటార్లు చోరీకి గురవుతున్నాయి. మండలంలోని రామోజీ తండా ప్రభుత్వ పాఠశాలలోనూ దొంగతనాలు జరగగా, పోలీసుల విచారణలో నిందితుల ఆచూకీ తెలియలేదు. ఇటీవల ఏపూరులోని బెల్టుషాపులో చోరీ జరిగింది. సీసీటీవీ పుటేజీ ఆధారంగా రామోజీ తండాకు చెందిన బానోతు నవీన్‌ను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ చోరీల్లో తనతో పాటు మరికొందరు ఉన్నట్లు విచారణలో నవీన్ వెల్లడించాడు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా రామోజీ తండాకు చెందిన గుగులోతు వీరశేఖర్‌ను బుధవారం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.
ఆత్మకూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ జరిపారు. రాత్రి 12 గంటల సమయంలో పోలీసులు తండా సర్పంచ్‌కు ఫోన్ చేసి వీరశేఖర్‌ను తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో వీరశేఖర్ సోదరుడు వీరన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సొంత పూచికత్తుపై వీరశేఖర్‌ను తీసుకెళ్లాడు. అప్పటికే ఆ యువకుడిని పోలీస్ స్టేషన్‌లో పోలీసులు విపరీతంగా కొట్టారు. గోడ కుర్చీ వేయించారు. ఆ యువకుడి మూత్రాన్ని అతడితోనే తాగించి రాక్షసానందం పొందినట్లుగా బాధితులు ఆరోపించారు.
ఇంటికి వచ్చిన బాధితుడు వీరశేఖర్ గురువారం తెల్లవారు జామున నోటి మాట రాకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో బంధువులు గురువారం నడవలేని స్థితిలో ఉన్న వీరశేఖర్‌ను ట్రాక్టర్‌పై తీసుకొచ్చి ఆందోళన చేశారు. బాధ్యులైన ఎస్సై, సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది. ఇటీవల విడుదలైన ‘జై భీమ్’ సినిమాతో ఈ ఘటనను పోల్చుతున్నారు.