Praveen Murder Case: సూర్యాపేట ప్రవీణ్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు, నిందితుడు అతడే!
Praveen Murder Case: సూర్యాపేట జిల్లా రాజా నాయక్ తండాలో ఈ నెల 15వ తేదీన జరిగిన ప్రవీణ్ హత్యను పోలీసులు ఛేదించారు. రవాణా అధికారియే ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్టు చేశారు.
Praveen Murder Case: వాళ్లంతా ఫ్రెండ్స్.. ఎప్పటిలాగే తప్ప తాగారు. కానీ ఈసారి వారి మధ్య మాటా మాట పెరిగింది. ఘర్షణ పడ్డారు. మిగతా వారంతా కలిసి ఒకడిని దారుణంగా కొట్టి చంపారు. ఈ కేసు సూర్యాపేట జిల్లా రాజా నాయక్ తండాలో ఈ నెల 15న జరిగింది. మృతుడి పేరును ప్రవీణ్ గా గుర్తించిన పోలీసులు నిందితుల కోసం వెతకడం ప్రారంభించి కేసును ఛేదించారు.
అసలేం జరిగింది..?
మద్యం మత్తు మనిషి మృగంగా మారుస్తుంది. ఆ కిక్కులో ఏం చేస్తున్నామో.. ఎందుకు చేస్తున్నామో అనే సోయి ఉండదు. విపరీతమైన ధోరణిలో ప్రవర్తిస్తుంటారు. సంబంధాలకు విలువ ఇవ్వరు.. అన్నదమ్ములు అని చూడరు.. అక్కాచెల్లెళ్లు అని కూడా పట్టింపు ఉండదు. ఆ మద్యం నిషా నషాళానికి ఎక్కితే మనిషి మనిషిలా ఉండడు. ఆ మత్తులోనే దారుణాలు, ఘోరాలు జరుగుతుంటాయి. సూర్యాపేట జిల్లాలో మద్యం మత్తులో ఓ యువకుడిని ఫ్రెండ్స్ హత్య చేశారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. వికారాబాద్ జిల్లా రవాణా అధికారిగా పని చేస్తున్న భద్రు నాయకే ప్రధాన నిందితుడిగా తేల్చారు.
ప్రవీణ్ హత్యకు గల కారణాలు ఏంటి?
భద్రునాయక్ అన్నదమ్ముల మధ్య కొన్ని రోజులుగా ఆస్తి వివాదం కొనసాగుతోంది. ఈ గొడవలు కాస్త చంపాలి అనుకునేంత వరకు వెళ్లాయి. అన్న వీరూ నాయక్ ను ఎలాగైనా చంపాలని అనుకున్నాడు తమ్ముడు భద్రు నాయక్. అతడి హత్యకు పథకం పన్నాడు. కానీ వీరూ హత్య అనుకున్నట్లుగా జరగలేదు. వీరూ నాయక్ ను ప్లాన్ ప్రకారం హత్య చేయలేక పోయాడు భద్రు నాయక్. అయితే.. తన ప్లాన్ అంతా ప్రవీణే లీక్ చేసి ఉంటాడని భద్రు నాయక్ కు అనుమానం. తన అన్న వీరూ నాయక్ తో చేతులు కలిపి తనను మోసం చేస్తున్నాడని అనుకున్నాడు. అన్నను హత్య చేయడం కంటే ముందు ప్రవీణ్ ను హత్య చేయాలని పథకం పన్నాడు. అయితే భద్రు నాయక్ ఇప్పుడు పన్నిన పథకం సక్సెస్ అయింది.
పథకం ప్రకారమే హత్య.. ఆపై గుట్టల్లో..
ప్లాన్ ప్రకారం తన స్నేహితులతో కలిసి సంపంగి ప్రవీణ్ ను తాగడానికి తీసుకెళ్లారు. అందరూ కలిసి ఫుల్లుగా తాగారు. ప్రవీణ్ పూర్తిగా మత్తులో మునిగేలా చేశారు భధ్రు నాయక్, అతడి ఫ్రెండ్స్. ప్రవీణ్ పూటుగా తాగి ఊగుతున్నాడు. చిన్నగా తోసి వేసినా కింద పడిపోయే స్థితిలో ఉన్నాడు. ఇదే కరెక్టు సమయం అనుకున్న భద్రు నాయక్. తన పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమయ్యాడు. తన ప్లాన్ ప్రకారం ప్రవీణ్ ను హత్య చేశారు. అనంతరం తిమ్మాపురం గుట్టల్లో మృతదేహాన్ని పడేసి అక్కడి నుండి పరారయ్యారు.
ఏడుగురు అరెస్టు.. సీన్ రీకన్ స్ట్రక్షన్..
ఈ కేసును ఛేదించిన పోలీసులు ముమ్మరంగా గాలించి భద్రు నాయక్ ను కీలక నిందితుడిగా తేల్చారు. అతడితో పాటు సహకరించిన మరో ఆరుగురిని అరెస్టు చేశారు. వారిలో కోర్టులో హాజరు పరిచిన అనంతరం దర్యాప్తు కొనసాగనుంది. వారిని సంఘటన స్థలానికి తీసుకు వెళ్లి హత్య జరిగిన తీరును సీన్ రీకన్ స్ట్రక్షన్ చేయనున్నారు. దాని ద్వారా హత్య ఎలా జరిగిందన్నది పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంటుంది.