Munugode News: మునుగోడులో పొలిటికల్ రచ్చ! కాంగ్రెస్ ఆఫీస్ దగ్ధం, రేవంత్ ప్రచారం రోజే - నిరసనలకు పిలుపు
కాంగ్రెస్ కార్యాలయం ధ్వంసం ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు.
Munugode News: మునుగోడు నియోజకవర్గం చండూర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్ధం సంఘటనపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని దుండగులు దగ్ధం చేశారు. మంగళవారం చండూర్ మండలంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రచారం ఉంది. ఆ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో రాజకీయ కక్షలతో పార్టీ కార్యాలయం, ప్రచార సామగ్రిని దుండగులు దగ్ధం చేసినట్లు చెబుతున్నారు.
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ప్రత్యర్థులు ఈ దుష్ట చర్యలకు పాల్పడుతున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టి ధ్వంసం చేయడం దారుణం అని అన్నారు.
రేవంత్ రెడ్డి ఆగ్రహం
కాంగ్రెస్ కార్యాలయం ధ్వంసం ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ దిమ్మెలు కూల్చినా, పార్టీ కార్యాలయాలు తగలబెట్టినా.. మునుగోడు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని ఆయన తేల్చి చెప్పారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలతో కాంగ్రెస్ గెలుపును ఆపలేరని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఎన్నో చిత్ర, విచిత్రాలతో పాటు.. మరెన్నో కుట్రలకూ సాక్షంగా నిలుస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్ సంయుక్తంగా వ్యూహాలు రచిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారానికి అడుగడునా ఇబ్బందులు సృష్టిస్తున్న విషయం తెలిసిందేనని అన్నారు.
బీజేపీ, టీఆర్ఎస్ లకు వణుకు పుట్టింది. మునుగోడులో కాంగ్రెస్ కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే పార్టీ కార్యాలయాల మీద దాడులు చేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యి మా క్యాడర్ ని బెదిరిచే కుట్ర చేస్తున్నాయి. బెదిరిస్తే బెదిరేది లేదు. పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళను 24 గంటల్లో అరెస్ట్ చేయాలి. లేదంటే ఎస్పీ కార్యాలయం ముందు నేనే ధర్నా చేస్తా. జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలి’’ అని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.
నేడు టీఆర్ఎస్ తరపున మంత్రి ఎర్రబెల్లి (Minister Errabelli Dayakar Rao) ప్రచారం
మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో భాగంగా చండూరు 3వ వార్డులో నేడు (అక్టోబరు 11) 2వ, 3వ వార్డుల ఇంచార్జీ, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. డప్పు చప్పుళ్లతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ వెళుతూ, టీఆర్ఎస్, కారు గుర్తుకు ఓటు వేయాలని మంత్రి అభ్యర్థించారు. ప్రజలను కలుస్తూ, వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ, వారితో మాట్లాడుతూ, ఫోటోలు దిగుతూ, ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాలకుర్తి నియోజకవర్గం నుండి ప్రచారం కోసం వెళ్లారు.