అప్పుడు ఫైనాన్స్ కట్టలేని కేసీఆర్ ఇవాళ వంద కోట్ల విమానం కొన్నారు- బండి సంజయ్
Bandi Sanjay : మునుగోడు తీర్పు కోసం యావత్ తెలంగాణ ఎదురు చూస్తోందని బండి సంజయ్ అన్నారు. ఉపఎన్నిక ఫలితంతో కేసీఆర్ మైండ్ బ్లాంక్ అవ్వాలన్నారు.
Bandi Sanjay : మునుగోడు ప్రజలిచ్చే తీర్పు తెలంగాణ భవిష్యత్ ను నిర్దేశించబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలోని యువత, ఉద్యోగులు, రైతులు, కార్మికులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ పాలనతో తీవ్రంగా నష్టపోయారన్నారు. అన్ని వర్గాల ప్రజలంతా కేసీఆర్ పై కసితో ఉన్నారని, మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ పై ఉన్న కసినంతా ఓటు రూపంలో చూపాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయ్యేలా భారీ మెజారిటీతో బీజేపీని గెలిపించాలని కోరారు. బీజేపీ మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ లో పాల్గొనేందుకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్, ప్రభారీ అరవింద్ మీనన్ లతో బండి సంజయ్ చండూరు వచ్చారు. నియోజకవర్గానికి చెందిన వేలాది మంది కార్యకర్తలు మోటార్ బైక్ లు, డీసీఎంలు, కార్లలో తరలిరావడంతో చండూరు కాషాయమయమైంది. దీంతో చండూరులో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చిన వేలాది మందిని ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు.
ఓటుకు రూ.40 వేలు
మునుగోడు ఎన్నికలు యావత్ తెలంగాణ భవిష్యత్ ను నిర్దేశించే ఎన్నిక కాబోతోందని బండి సంజయ్ అన్నారు. 8 ఏండ్లుగా అబద్దాలు చెబుతూ మోసాలు చేస్తూ కోట్లు దండుకుంటూ ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్ ను రోడ్డు మీదకు గుంజుకొచ్చిన ఘనత బీజేపీదే అన్నారు. కేసీఆర్ పాలన పట్ల యువత, ఉద్యోగులు, రైతులు, మహిళలు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలు కసితో ఉన్నారని తెలిపారు. ఉద్యోగాలు రాక, నిరుద్యోగ భృతి అందక యువత టీఆర్ఎస్ ను బొంద పెట్టాలా? అని ఎదురుచూస్తోందని విమర్శించారు. ఇది తెలిసే కేసీఆర్ మంత్రులను, ఎమ్మెల్యేలను పంపించి ఓటుకు రూ. 40 వేలు పంచేందుకు సిద్ధమయ్యాయని ఆరోపించారు.
ఉద్యమ సమయంలో రూపాయి కూడా లేదు
"తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వద్ద రూపాయి కూడా లేదు. ఫైనాన్స్ కట్టలేదని కేసీఆర్ ప్రచార రథాన్ని గుంజుకపోయిండ్రు. ఈఎంఐలు కట్టలేదని కేసీఆర్ కారును మంజీరా గ్రామీణ బ్యాంక్ వాళ్లు తీసుకుపోయిండ్రు. అట్లాంటోడు ఇయాళ రూ.100 కోట్లు పెట్టి సొంత విమానం ఎట్లా కొన్నారు? సమాధానం చెప్పాలి?. 8 ఏండ్ల పాలనలో దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల సొమ్మును దండుకున్నడే తప్ప అదనంగా ఒక్క ఎకరాకు కూడా కొత్తగా నీరియ్యలే. కేసీఆర్ పాలనతో విసిగిపోయి మరో ఏడాది పదవిలో ఉండే అవకాశమున్నా మునుగోడు అభివృద్ధి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు. ఆయన రాజీనామాతో గట్టుప్పల్ ను కొత్త మండలం చేశారు. ఈ నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు. చౌటుప్పల్ నుంచి తంగెడుపల్లి రోడ్డును ఆగమేఘాల మీద వేసిండ్రు."- బండి సంజయ్
కేసీఆర్ జిమ్మిక్కులు
హుజూరాబాద్ ఎన్నికల్లో దళిత బంధు కింద ఒక్కో దళితుడి అకౌంట్లో డబ్బులు వేశారని బండి సంజయ్ అన్నారు. ఎన్నికల తర్వాత వాటిని మళ్లీ వాపస్ తీసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ చేసే జిమ్మిక్కులను అర్ధం చేసుకోవాలని కోరారు. మునుగోడు తీర్పు కోసం యావత్ తెలంగాణ ఎదురుచూస్తోందన్నారు. మీ దమ్ము ఏందో చూపించే టైం వచ్చిందని తెలిపారు. కేసీఆర్ పై మీకున్న కసిని ఓటు ద్వారా చెప్పండని పిలుపునిచ్చారు. మీరేసే ఓటుతో కేసీఆర్ మైండ్ బ్లాంక్ కావాలన్నారు.