Khammam Rains: జిల్లాలో నిండుకుండలా జలాశయాలు - కిన్నెరసాని గేట్లు ఎత్తిన అధికారులు
Rains in Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. కిన్నెరసాని డ్యామ్‌లో 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
– భారీ వర్షాలతో నిండుకుండలా చెరువులు.. ప్రాజెక్టులు
– వరద తాకిడికి కిన్నెరసాని, తాలిపేరు గేట్లు ఎత్తి వేసిన అధికారులు
– భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం..
Khammam Rains: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఎడతెరిపిలేని వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా గత రెండు రోజులుగా వర్షం కురుస్తుండటంతో చాలా చోట్ల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధానంగా కిన్నెరసాని డ్యామ్‌లో 4 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 407 అడుగులు ఉండగా ఇప్పటికే 403 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. 24 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో గేట్టు ఎత్తి 21 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు ఎత్తి వేయడంతో వరద నీటిని చూసేందుకు పర్యాటకుల సందడి మొదలైంది.
తాలిపేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
మరోవైపు భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు సంబందించిన 16 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 17వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో నీటి మట్టం పెరుగుతుంది. ప్రస్తుతం 31 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. వరద నీరు ఇలానే కొనసాగితే సోమవారం నాటికి భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వరదల కారణంగా భద్రాద్రి జిల్లాలోని రాజాపురం – యానంబైలు వద్ద చప్టాపై నీరు వస్తుండటంతో 30 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఖమ్మం జిల్లాలోని పల్లిపాడు సమీపంలో వాగు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది.
Also Read: Godavari River: భద్రాచలం వద్ద ఉధృతంగా గోదావరి ప్రవాహం, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే ఛాన్స్! Helpline నెంబర్లు ఇవే
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. మిగతా జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో పాటు ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు.
Also Read: Nizamabad Rains: నిజామాబాద్ జిల్లాలో దంచి కొడుతున్న వర్షాలు - పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు