Godavari River: భద్రాచలం వద్ద ఉధృతంగా గోదావరి ప్రవాహం, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే ఛాన్స్! Helpline నెంబర్లు ఇవే
Godavari River at Bhadrachalam: తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో భద్రాచలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంది.
Bhadrachalam Godavari River Water level: గత రెండు రోజులుగా తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో భద్రాచలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ కురుస్తున్న వర్షాలకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో నదికి వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నది ప్రస్తుతం 30 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. వరద నీరు ఇలా చేరుతున్న నేపథ్యంలో నేటి (ఆదివారం) రాత్రికి భద్రాచలం వద్ద గోదావరి నది 43 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. దీంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏ క్షణంలోనైనా అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ఏ క్షణంలోనైనా భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని, భద్రాద్రి జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అప్రమత్తం చేశారు.
గొర్రెలు, మేకలు పశువులను సైతం మేతకు విడిచిపెట్టకుండా ఎత్తయిన ప్రాంతాలకు తరలించాలని వాటి కాపర్లకు సూచించారు. ప్రజలు వాగులు, వంకలు, నీటి ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేయవద్దని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా వాసులకు అత్యవసర సేవల కోసం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు.
అత్యవసర సేవల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..
కలెక్టర్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ - 08744-241950
కలెక్టర్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ వాట్సప్ నెంబర్ - 93929 29743
ఆర్డీవో కార్యాలయం కంట్రోల్ రూమ్ వాట్సప్ నెంబర్ - 93929 19750
భద్రాచలం సబ్‌కలెక్టర్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ - 08743 232444
భద్రాచలం సబ్‌కలెక్టర్ ఆఫీస్ వాట్సప్ నెంబర్ - 63024 85393
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. మిగతా జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో పాటు ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు.