Nizamabad Rains: నిజామాబాద్ జిల్లాలో దంచి కొడుతున్న వర్షాలు - పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
Water Level At Sriram Sagar Project: రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టులకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ సగానికి పైగా నిండింది.
![Nizamabad Rains: నిజామాబాద్ జిల్లాలో దంచి కొడుతున్న వర్షాలు - పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు Nizamabad Rains: Heavy water flow with effect of Rains in District DNN Nizamabad Rains: నిజామాబాద్ జిల్లాలో దంచి కొడుతున్న వర్షాలు - పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/10/1b456cb72e308cce65860873ab1bc0511657429846_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Water Level At Sriram Sagar Project: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షం దంచి కొడుతోంది. గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశానికి రంద్రం పడిందా అన్నట్లు జిల్లాలో పలు చోట్ల వాన ఏకధాటిగా కురుస్తోంది. భారీ వర్షానికి ప్రాజెక్టుల్లోకి జలకళ సంతరించుకుంది. ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ క్యాచ్ మెంట్ ఏరియాతో పాటు ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 4,92,415 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.
ఇప్పటికే 57 టీఎంసీల నీటి మట్టం..
ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 57 టీఎంసీలుగా ఉంది, పూర్తి స్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు. కేవలం 48 గంటల వ్యవధిలోనే 27 టీఎంసీల వరద వచ్చి చేరింది. గంట గంటకు వరద ఉధృతి పెరిగిపోతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా... ప్రస్తుతం 1081 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు. కాగా, ప్రస్తుతం సగానికి పైగా టీఎంసీల నీరు ఉంది. దీంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇక సాగు నీటి డోకా ఉండబోదు. భారీ వరద వస్తుండటంతో కందకుర్తి వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. 3 నదుల త్రివేణి సంగమం కందకుర్తి వద్ద ప్రమాదకరంగా గోదావరి ప్రవహిస్తోంది. కందకుర్తి వద్ద పురాతన శివాలయం పూర్తిగా నీట మునిగింది.
పూర్తిగా నిండిన జలాశయాలు..
ఉమ్మడి జిల్లాలో చిన్నతరహా ప్రాజెక్టులు పోచారం, సింగీతం, కళ్యాణి ప్రాజెక్టులు పూర్తిస్థాయికి చేరాయి. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు జలకలను సంతరించుకున్నాయి. కల్యాణి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. కల్యాణి ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్ట్ లోకి భారీ స్థాయిలో ఇన్ ఫ్లో వస్తుండడంతో అదే మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఎగువ ప్రాంతం నుండి ప్రాజెక్ట్ లోకి వస్తున్న 331 క్యూసెక్కుల వరద నీటిని ప్రాజెక్ట్ రెండు వరద గేట్లను ఎత్తి దిగువ మంజీర నదిలోకి అంతే మొత్తంలో నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి మట్టం 409.50 మీటర్లు ఉండగా ప్రస్తుతం 409.10 మీటర్ల కు నీటి మట్టానికి చేరుకుంది.
జుక్కల్ మండలం కౌలస్ నాలా ప్రాజెక్ట్ 2గేట్లను ఎత్తి 1096క్యూసెక్కుల నీటిని దిగువన కౌలస్ వాగు ద్వారా మంజీరా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 458 మీటర్లకు గాను ప్రస్తుతం 457.60 మీటర్లు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుండి 1,828 ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. అధికారులు ఎప్పటికప్పుడూ నీటి మట్టాన్ని చెక్ చేసి గేట్లు ఎత్తుతూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Also Read: Green Building: ఈ బిల్డింగ్‌కి భారీ టవర్ ఫ్యాన్! దేశంలోనే ఫస్ట్, హైదరాబాద్‌లో - ప్రత్యేకతలు ఏంటంటే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)