Revanth Vs Uttam Kumar : ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంట్రీతో వెనక్కి తగ్గిన రేవంత్, నల్గొండలో నిరుద్యోగ నిరసన దీక్ష రద్దు
Revanth Reddy Vs Uttam Kumar Reddy : నిరుద్యోగ నిరసన తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చుపెట్టింది. తనకు తెలియకుండా తన జిల్లాలో నిరసన కార్యక్రమం చేపట్టడం ఏంటని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో రేవంత్ రెడ్డి ఆ నిరసన విరమించుకున్నారు.
![Revanth Vs Uttam Kumar : ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంట్రీతో వెనక్కి తగ్గిన రేవంత్, నల్గొండలో నిరుద్యోగ నిరసన దీక్ష రద్దు Nalgonda Congress Unemployment protest cancelled MP Uttam kumar reddy complaint on Revanth Reddy Revanth Vs Uttam Kumar : ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంట్రీతో వెనక్కి తగ్గిన రేవంత్, నల్గొండలో నిరుద్యోగ నిరసన దీక్ష రద్దు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/9b80f0a41e6960043b789661581f4da51681987977692235_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Revanth Reddy Vs Uttam Kumar Reddy :తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి ఇంటిపోరు రచ్చకెక్కింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన నిరుద్యోగ నిరసనకు కాంగ్రెస్ సీనియర్లు చెక్ పెట్టారు. దీంతో నల్గొండ జిల్లాలో ఈ నెల 21న ఎంజీ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి తలపెట్టిన నిరుద్యోగ నిరసన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. తన జిల్లాలో తనకు తెలియకుండా పార్టీ కార్యక్రమాలు చేపట్టడం ఏంటని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లడంతో దీంతో టీపీసీసీ ఈ నిరసన సభను రద్దు చేసింది. తనకు సమాచారం ఇవ్వకుండానే నిరుద్యోగ సభ ఏర్పాటు చేశారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి... కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ థాక్రేకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందనో లేక అధిష్ఠానం ఆదేశించిందో గానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ సభను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకే ఇలా చేశారని ప్రచారం జరుగుతోంది.
వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి?
తెలంగాణ కాంగ్రెస్ లో తిరుగులేని స్థితిలో ఉన్న రేవంత్‌రెడ్డికి తొలిసారి గట్ట ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరంతో రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించిన నల్గొండ నిరుద్యోగ నిరసన దీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. దీంతో అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ పోరులో సీనియర్లతో పైచేయిగా నిలిచింది. ఈ నెల 21న నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన దీక్షను చేపట్టాలని రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. దీంతో వివాదం మొదలైంది. రేవంత్ రెడ్డి ప్రకటనపై ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన జిల్లాలో తనకు కనీస సమాచారం ఇవ్వకుండా, చర్చించకుండా ఏ విధంగా సభ నిర్వహిస్తారని మీడియా పరంగా విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దీక్షపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీంతో అధిష్ఠానం ఆదేశించిందో లేక ఆయనే వెనక్కి తగ్గారో కానీ రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరసన విరమించుకున్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే?
బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పే కాంగ్రెస్ రానున్న ఎన్నికల కోసం కొన్ని రోజులుగా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ వస్తోంది. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర స్ఫూర్తితో హాథ్ సే జోడో యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి పలు కార్యక్రమాలు చేపట్టి కాంగ్రెస్ శ్రేణులను తిరిగి యాక్టివేట్ చేసే పనిలో పడింది కాంగ్రెస్ నాయకత్వం. తాజాగా టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారాన్ని కూడా సమర్థంగా వాడుకుంది. క్వశ్చన్ పేపర్ల లీకులతో నిరుద్యోగుల సమస్యలు మరోసారి ఫోకస్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. నిరుద్యోగ నిరసన పేరుతో ఈ నెల 21వ తేదీన నల్గొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిరసన కార్యక్రమం నిర్వహించాని నిర్ణయించింది. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు జరగాల్సి ఉండగా.. నిరసన కార్యక్రమంపై తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమం గురించి తనకేమీ తెలియదని ఉత్తమ్ అన్నారు. స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న తనతో చర్చించకుడానే నిరసన కార్యక్రమ నిర్ణయం తీసుకున్నారని, అంతే కాకుండా మాజీ పీసీసీ అధ్యక్షుడు, స్థానిక ఎంపీ అయిన తనకు అధికారిక సమాచారం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నట్లు తాను ఎవరితోనూ చెప్పలేదని, తనతో చర్చించి నిరసన కార్యక్రమం చేపట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తన పార్టీ తన నియోజకవర్గంలో నిరుద్యోగ నిరసన కార్యక్రమంలో నిర్వహిస్తుందన్న విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)