Jupally Krishna Rao Arrest: కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగిన మాజీ మంత్రి జూపల్లి అరెస్ట్, ఉద్రిక్తత
Nagarkurnool Police Arrests Jupally Krishna Rao: రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నాగర్ కర్నూల్ కలెక్టర్ రేట్ ఎదుట సోమవారం ధర్నాకు దిగిన మాజీ మంత్రి జూపల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Nagarkurnool Police Arrests Jupally Krishna Rao: నాగర్ కర్నూల్: రైతులతో కలిసి ఆందోళనకు దిగిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును పోలీసులు అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూల్ కలెక్టర్ రేట్ ఎదుట సోమవారం ధర్నాకు దిగిన జూపల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరి కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టాలని జూపల్లి డిమాండ్ చేశారు. కాగా, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని చెబుతున్నా రైతులకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతోందని జూపల్లి ఆరోపించారు. వరి కొనుగోళ్లలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను అరికట్టాలని కోరినా ప్రయోజనం కనిపించలేదన్నారు. దాంతో సోమవారం నాడు రైతులతో కలిసి నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కు ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. కలెక్టర్ సత్వరమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి జూపల్లి డిమాండ్ చేశారు. అయితే అధికారులు స్పందించకపోవడంతో రోడ్డుపైనే రైతులతో కలిసి బైటాయించి అన్నదాతలకు న్యాయం చేయాలని కోరారు. రోడ్డుకు అడ్డంగా బైఠాయించడంతో ట్రాఫిక్ కు అంతరాయం తలెత్తి, వాహనాలు పెద్ద సంఖ్యలో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
తాము చెప్పినా వినిపించుకోవడం లేదని కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగిన మాజీ మంత్రి జూపల్లితో పాటు రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్న జూపల్లిని పోలీసులు అరెస్ట్ చేయడంతో రైతులు, ఆయన మద్దతుదారులు ఓ బైక్ కు నిప్పుపెట్టారు. దాంతో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
గత కొన్నిరోజులుగా కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ లో రైతులతో కలిసి ధాన్యాన్ని పరిశీలిస్తున్నారు జూపల్లి. పండించిన ధాన్యాన్ని మార్కెట్ యార్డ్ కి తీసుకొచ్చి పది రోజులైనా తూకం చేయడంలేదని రైతులు జూపల్లికి తమ సమస్యను చెప్పుకున్నారు. తూకం చేసిన వాటికి పది రోజులైనా రసీదులు ఇవ్వడం లేదని, అధికారులు మిల్లర్లకు వంత పాడుతూ ధాన్యం తూకం చేస్తున్న సందర్భంలో క్వింటాలకు 5 నుండి 10 కిలోల మేర తరుగు తీయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో రైతన్నలు ఇబ్బంది పడుతున్నారని, ఉన్నతాధికారులు గానీ, ప్రభుత్వం గానీ చర్యలు తీసుకోవాలని జూపల్లి పలుమార్లు కోరారు. నాలుగైదు రోజుల కిందట నాగర్ కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్ కి ఫోన్ చేసి కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో పలు కొనుగోలు కేంద్రాల్లో సమస్యలున్నాయని తెలిసినా, ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని జేసీ ని జూపల్లి ప్రశ్నించారు. ఫలితం లేకపోవడంతో నేడు కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ధర్నాకు దిగడంతో పోలీసులు మాజీ మంత్రి జూపల్లితో పాటు రైతులను అరెస్ట్ చేశారు.
ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయడంతో చాలా ఆనందంగా ఉందన్నారు మాజీ మంత్రి జూపల్లి. గడచిన మూడు సంవత్సరాల నుంచి తనను పార్టీ నాయకుడిగా కూడా గుర్తించలేదన్నారు. తనకు పంజరంలో నుంచి పక్షి బయటకు వచ్చినంత సంతోషంగా ఉందని, తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సస్పెండ్ చేయడంతోనే బీఆర్ఎస్ వాళ్లకు తానంటే ఎంత భయముందో తెలిసిందన్నారు. ఖజానాలో సొమ్మును ఇష్టారీతిన పంచుతున్నారా, సభ్యత్వ నమోదు కోసం పుస్తకాలు అడిగితే ఎందుకు ఇవ్వాలేదని జూపల్లి ప్రశ్నించారు. ఈ క్రమంలో పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు.





















