Revanth Reddy : కేసీఆర్ ఎవరికి లొంగిపోయారు, ఎవరి ముందు వంగిపోయారు- రేవంత్ రెడ్డి
Revanth Reddy : మునుగోడు ప్రజలపై టీఆర్ఎస్, బీజేపీ మిడతల దండులా దాడి చేస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. చెప్పుకోడానికి చరిత్ర లేనోళ్లు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.
Revanth Reddy : టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. మునుగోడులో పర్యటించిన కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, నిర్వాసితుల ఆత్మహత్యలకు కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో సమస్యలను పరిష్కరించాల్సింది పోయి కేవలం ఉప ఎన్నికలపైనే టీఆర్ఎస్, బీజేపీలు దృష్టి పెట్టాయని ఆరోపించారు. గొర్ల మందపై తోడేళ్లలా, మిడతల దండులా మునుగోడు ప్రజలపై దాడి చేయడానికి టీఆర్ఎస్, బీజేపీలు వస్తున్నాయన్నారు. సెప్టెంబర్ 17 నుంచి 2023 సెప్టెంబర్ 17 వరకు తెలంగాణ విమోచన వజ్రోత్సవాలు నిర్వహించాలని కాంగ్రెస్ తరఫున పిలుపునిస్తున్నానన్నారు.
Released charge sheet in Munugodu on TRS & BJP who have failed to fulfill their promises along with @UttamINC garu @NsBoseraju garu,Jana Reddy garu,Damodar Reddy garu,Balram Naik garu & @DrMalluRavi1 garu. #ManaMunugodeManaCongress pic.twitter.com/5xYZRNTSGr
— Revanth Reddy (@revanth_anumula) September 3, 2022
విమోచన వజ్రోత్సవాలు
"తెలంగాణ పోరాట చరిత్రను దేశానికి చాటాల్సిన అవసరం ఉంది. వజ్రోత్సవాలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. కేంద్రం రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టి ఊరూరా వజ్రోత్సవాలు చేయాలి. కాంగ్రెస్ ను విమర్శించిన కేసీఆర్ ఎనిమిదేళ్లుగా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం లేదన్నారు. మీరు ఎవరికి లొంగిపోయారు, ఎవరి ముందు వంగిపోయారు.సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించనందుకు కేసీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. తెలంగాణ సమాజాన్ని నిజాం నుంచి విముక్తి కలిగించింది కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. చెప్పుకోవడానికి చరిత్ర లేనోళ్లు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు" - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
అదే బీజేపీ కుట్ర
మునుగోడులో కాంగ్రెస్ ఓటు బ్యాంకు 97 వేల ఓట్లని రేవంత్ రెడ్డి అన్నారు. కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ ఓటు బ్యాంకును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రోజుకో రెండు గంటలు ఇంటింటికి తిరిగితే లక్ష ఓట్లు సాధిస్తామన్నారు. కాంగ్రెస్ ను ఓడించే శక్తి ఆ మోదీకి లేదన్నారు. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సర్వం అండగా నిలిస్తే.. ఇప్పుడు మోదీకి రూ.22 వేల కోట్లకు అమ్ముడుపోయారని విమర్శించారు. మునుగోడు ఉపఎన్నికల వల్ల అమ్ముడు పోయే సన్నాసులకు నిధులు వచ్చాయి తప్ప.. నియోజక వర్గంలో ఏ గ్రామనికైనా నిధులొచ్చాయా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కమ్యూనిస్టులను చూస్తే జాలేస్తుందన్నారు. కమ్యూనిష్టు పార్టీలను బొందపెట్టిన టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. నాయకులు ఎక్కడికైనా పోనీ మునుగోడు కమ్యూనిస్టు కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. విలీన దినోత్సవం పేరుతో మత కల్లోలం సృష్టించాలని బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజల్లో చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తోందన్నారు. ఒక్క ఓటుతో ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలని కోరారు.
Also Read : Crime News : అవినీతి చాలా డేంజర్ - ఈ మాజీ ఎమ్మార్వో విషాదాంతమే సాక్ష్యం !
Also Read : Telangana News : మూడు రోజుల పాటు తెలంగాణ విలీన ఉత్సవాలు - బీజేపీకి కౌంటర్‌గా కేసీఆర్ నిర్ణయం !