Minister Niranjan Reddy : మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం, రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీజేపీ పోటీ- మంత్రి నిరంజన్ రెడ్డి
Minister Niranjan Reddy : మునుగోడు ఉపఎన్నిక బీజేపీ ప్రజలపై రుద్దిన ఉపఎన్నిక అని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు.
Minister Niranjan Reddy : తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నాక తెలంగాణ టీఆర్ఎస్ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు మునుగోడు ఉపఎన్నిక వేదికగా మారింది. మునుగోడులో గెలిచి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ విశ్వప్రయత్నం చేస్తుంది. కనీసం మునుగోడులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. మూడు ప్రధాన పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది.
ప్రజలపై రుద్దిన ఎన్నిక
మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తథ్యం అంటున్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బీజేపీలు పోటీపడుతున్నాయని వ్యాఖ్యానించారు. మంగళవారం మర్రిగూడెం మండలం దేవర భీమనపల్లిలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్ ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లడుగుతాయని మండిపడ్డారు. మునుగోడు ఉపఎన్నిక బీజేపీ బలవంతంగా ప్రజల మీద రుద్దిన ఎన్నిక అని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తుందన్నారు. నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ బారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించామన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ లతో ఆడబిడ్డలకు అండగా నిలిచామన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు ఆసరా పింఛన్‌లు అందజేస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
విపక్షాలకు ఓట్లడిగే అర్హత లేదు
మునుగోడులో సాగునీటి కోసం శివన్నగూడెం, క్రిష్ణ రాయినిపల్లి, లక్ష్మణపురం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మిస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. ప్రజల ఆశీస్సులు టీఆర్ఎస్ కు ఉన్నాయని మంత్రి తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి మిషన్ కాకతీయతో గ్రామాలకు నీళ్లు అందించామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు అమల్లో లేవన్నారు. విపక్షాలకు ప్రజలను ఓట్లడిగే అర్హత లేదన్నారు.
సానుభూతి డ్రామాలు
మునుగోడులో ప్రతిపక్షాల డ్రామాలు స్టార్ట్ అయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సానుభూతి కోసం చేతికి పట్టీలు వేసుకుంటున్నారన్నారు. దుబ్బాక, హుజురాబాద్ లలో ఇలాగే జరిగిందన్నారు. ఇవాళ జ్వరం, రేపు దాడులు అంటూ ఏడుపులు డ్రామాలు చేస్తారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ఫ్లోరెడ్ సమస్యను పూర్తిగా పరిష్కరించామన్నారు. మునుగోడు ప్రజలు సానుభూతి డ్రామాలను నమ్మొద్దన్నారు. డ్రామాలను నమ్మితే నష్టపోయేది మునుగోడు ప్రజలే అన్నారు. జనరల్ ఎన్నికల లోపు అభివృద్ధిలో మార్పు కనిపించకపోతే ప్రజలు అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరిస్తామన్నారు. వాళ్లంతట వాళ్లే దాడులు చేయించుకొని ఏడుస్తారని ఆరోపించారు.
ఇక మూడు రోజులే
"ఒకవైపు రాజగోపాల్ రెడ్డికి జ్వరం, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి ఏడుపు. మునుగోడులో టీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీతో గెలుస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యే మునుగోడులో ఉన్నా ప్రభుత్వ పథకాలు అన్ని అందినాయి. మునుగోడులో ఉన్నది కూడా తెలంగాణ సమాజమే. బీజేపీకి మిగిలింది ఇక మూడు రోజులే..కాబట్టి సెంటిమెంట్ రగిలించడానికి అనేక డ్రామాలు ప్రయత్నాలు. రాజకీయ పార్టీగా ప్రతి ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకుంటాం. మేం కాంట్రాక్టర్ల కోసం రాజకీయం చేసే వాళ్లం కాదు. కుట్రలు, కుతంత్రాలు మాకు అవసరం లేదు." -మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్