MLA Raja Singh: దమ్ముంటే ఆ పని చేయండి - సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్
MLA Raja Singh: తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరో సారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
MLA Raja Singh: తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మహబూబ్ నగర్ పర్యటన సందర్భంగా రోడ్ల వెంబడి మోదీని విమర్శిస్తూ, ప్రశ్నిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు దమ్ముంటే ప్రధాని మోదీని కలవాలని సవాల్ విసిరారు. ప్రధాని ఆదివారం రాష్ట్రానికి వస్తున్నారని, ఆయన్ను కలసి 2014 నుంచి తెలంగాణకు కావాల్సిన ప్రాజెక్టులను కేసీఆర్ అడగాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి ఎంత నిధులు రావాలి? ఎంత ఇచ్చారు? ఇంకా ఎంత రావాలో అడగాలని రాజా సింగ్ సవాల్ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవకుండా నిధులు రాలేదంటూ చెప్పడం ఏంటని మండిపడ్డారు. మోదీని కలిసి రాష్ట్రానికి ఏం నిధులు కావాలో ఎందుకు అడగటం లేదని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి ముఖం చూపించే ధైర్యం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు లేకనే అనవసర విమర్శలు చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వేసి తెలంగాణ ప్రజల్లో అభాసుపాలు కావొద్దంటూ అంటూ హితబోధ చేశారు. రాష్ట్రంపై ప్రధాని వివక్ష చూపుతున్నారని ప్రతిసారి అనడం సరికాదన్నారు. నిధుల గురించి మోదీని అడిగే దమ్ముందా అంటూ ప్రశ్నించారు.
గతంలో మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు ఇదే కేసీఆర్ ఆయనకు స్వాగతం పలికారని గుర్తు చేశారు. ప్రధాని గొప్పతనం గురించి మాట్లాడారని అన్నారు. కానీ ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌కు దమ్ములేదని, ఎంఐఎం లాగా వెనుక నుంచి వెన్నుపోటు పొడిచే అలవాటు ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఆలోచనల మాదిరి ప్రధాన మంత్రి ఆలోచన ఉండదన్నారు. చిన్న పిల్లాడు ప్రశ్నించినా సమాధానం చెప్పే గొప్ప వ్యక్తి మోదీ అన్నారు. తాను మరోసారి చెబుతున్నానని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు దమ్ముంటే నిధుల గురించి ప్రధానిని అడగాలని, సాయంగా వారి మంత్రులను కూడా తీసుకెళ్లవచ్చని వ్యంగ్యంగా అన్నారు.
ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు
తెలంగాణలో మరోసారి పొలిటికల్, పోస్టర్ వార్ మొదలైంది. ఈ సారి ఏకంగా ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ పోస్టర్లు వెలిశాయి. ప్రధాని మోదీ ఆదివారం మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో మరోసారి పోస్టర్లు వెలిశాయి. మోదీకి మహబూబ్‌నగర్‌లో, తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ పోస్టర్ల ద్వారా నిరసన తెలిపారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించే విషయమై జరిగిన అన్యాయంపై ఈ పోస్టర్ల ద్వారా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు, కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారని, మరి తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు వేశారు. తెలంగాణ మీద మోదీ సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ విమర్శించారు.
శంషాబాద్ విమానాశ్రయంలో కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వినూత్నంగా స్వాగత పోస్టర్లు ఏర్పాటు చేశారు. What happened Modi అంటూ ఎయిర్ పోర్ట్ పరిసరా ప్రాంతాల్లో పోస్టర్లు ద్వారా ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఏది.? పసుపు బోర్డు ఎక్కడ.? మీ హామీలు అన్ని నీటి ముటలేనా అంటూ ప్లెక్సీలలో ప్రశ్నించారు. రావణాసురుడు తలతో మోదీ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఐటీఐఆర్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,టెక్ష్ట్స్ టైల్ పార్క్, డిఫెన్స్ కారిడార్, మిషన్ భగీరథ నిధులు, గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డ్ ఎక్కడ అంటూ రావణాసురుడు తలతో మోదీ బ్యానర్ ఏర్పాటు చేశారు.