Ponnam Prabhakar: హైదరాబాద్‌కు ఒక్క రూపాయి తీసుకురాని వాళ్లు కేంద్ర మంత్రులుగా మనకు అవసరమా? - మంత్రి పొన్నం
Hyderabad Development : హైదరాబాద్‌కు ఒక్క రూపాయి తీసుకురాని వాళ్లకు కేంద్రమంత్రులుగా ఉండే అర్హత లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతులను కాపాడే బాధ్యత కాంగ్రెస్‌దే అన్నారు.
Minister Ponnam Slams BJP Union Ministers: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం, డిప్యూటీ సీఎంలకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగర అభివృద్ధికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధులు కేటాయించినట్లు తెలిపారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పైన వివక్ష చూపుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారని , గతంలో టూరిజం మంత్రిగా ఉన్నపుడు కూడా హైదరాబాద్ కోసం ఒక్క రూపాయి తీసుకురాలేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీ వస్తే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు హైదారాబాద్ నుండి కరీంనగర్ కు మార్చారు. ఆనాడు కరీంనగర్ కు స్మార్ట్ సిటీ అవసరం ఉందని.. కానీ హైదరాబాద్ కి అదనంగా స్మార్ట్ సిటీ తేవడానికి పెరుగుతున్న జనాభా కి అనుగుణంగా నీటి వనరులను పెంచడానికి చారిత్రాత్మక హైదారాబాద్ హెరిటేజ్, టూరిజం , ఆర్కియాలజీ ద్వారా అభివృద్ధి చేయడానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని మండిపడ్డారు.
మీ చిత్త శుద్ధి నిరూపించుకోండి
హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ,మెట్రో వాటర్ వర్క్స్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పోరేషన్ దాంతో పాటు హైదారాబాద్ లో మెట్రో అభివృద్ధి పనులకు.. ఆర్థిక లేమి తో కాంట్రాక్టర్లకు ప్రస్తుతం డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. నూతనంగా హైడ్రా, మూసి ప్రక్షాళన , మెట్రో ఇతర అంశాలకు 10 వేల కోట్లు కేటాయించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే రూ.10 వేల కోట్లు ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ల రూపంలో గాని లేదా స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు ఎన్ని నిధులు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు బడ్జెట్ సవరణ ల ద్వారా హైదారాబాద్ అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి నిధులు తెచ్చి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.
స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాల్సిందే
హైదరాబాద్ అభివృద్ధికి స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్ఆర్డిపి ,ఎస్ఎన్డీపీ ద్వారా రోడ్ల నిర్మాణాలు , నాళాల పునరుద్ధరణ చేపట్టడానికి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. తాగు నీటికి అమృత్ పథకం కింద నిధులు కేటాయించాలని కోరారు. ఇళ్ల నిర్మాణానికి, వీధి వ్యాపారులకు సాయం చేసేందుకు కృషి చేయాలని కోరారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్ , కిషన్ రెడ్డి లు బడ్జెట్ చాల బాగుంది అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని చెప్తున్నారు.. మీ నియోజకవర్గాలకు ఏం తేలేని మీకు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. బీజేపీ నేతలు ఏం ముఖం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు.
విభజన హామీలు నెరవేర్చాలి
రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి.. తెలంగాణ ప్రయోజనాల నిమిత్తం రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కేంద్రం సహకారం చేసే అవకాశం ఉన్నప్పటికీ మాటలకే పరిమితం అవుతున్నారన్నారు. ఇంకా సమయం మించి పోలేదని.. బడ్జెట్ సెషన్ లోనే కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించాలన్నారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుండి మా ప్రతినిధి బృందం రావడానికి సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడగడానికి తమకు ఏం నామోషీ లేదన్నారు. ఫెడరల్ సిస్టమ్ లో అది తమ హక్కు గా భావిస్తామన్నారు. రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు ముందుకు వచ్చి నిధులు తేవడానికి సంబంధించి చొరవ చూపెట్టాలని కోరారు.
కాంగ్రెస్ హయాంలోనే ఎల్లంపల్లి పూర్తి
బలహీన వర్గాల రిజర్వేషన్లకు ఇబ్బందులు లేకుండా గ్రామపంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పారు. గతంలో బిల్లుల విషయంలో మోదీ ప్రభుత్వానికి కేసీఆర్ మద్దతు ఇచ్చి, నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకుండా ఉన్నారంటూ విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణకు జరిగిన అన్యాయంపై నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకుండా నిరసన తెలుపుతున్నామని వెల్లడించారు. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ హయాంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి అయిందని అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టకపోవడం వల్ల రాష్ట్రానికి భారీగా నష్టం వాటిల్లిందన్నారు. విహారయాత్రలకు వెళ్లినట్లు బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లారని ఎద్దేవా చేశారు. రైతులను కాపాడే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అంటూ స్పష్టం చేశారు.