Sankranti 2025: సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్- ఊరెళ్లే రహదారులన్నీ జామ్
Sankranti Jam: హైదరాబాద్ నుంచి ఊరు వెళ్లే రహదారులన్నీ ఫుల్ ప్యాక్ అయిపోయాయి. ఏ దారి చూసిన సంక్రాంతి సందడే కనిపిస్తోంది. ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే పల్లెకు వెళ్తున్నామన్న ఆనందం అందరి మొహాల్లో వికసిస్తోంది.

Sankranti 2025: సంక్రాంతి కోసం హైదరాబాద్ మొత్తం పల్లెకు పయనమైంది. రెడ్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు అన్నీ కూడా జనంతో కిక్కిరిసిపోయాయి. అమీర్ పేట నుంచి అమలాపురం వరకు ఏ రోడ్డు చూసిన జనంతో నిండిపోయి ఉంది. మెట్రోల రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్ అన్ని రోడ్లు ఊరివైపే దారి చూపిస్తున్నాయి. ఎక్కడ చూసిన ఇసకేస్తే రాలనట్టుగా మారాయి.
హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే శుక్రవారం సాయంత్రం నుంచి రద్దీగా మారింది. ఇన్ని రోజులు హైదరాబాద్‌లో చూసిన ట్రాపిక్ ఇప్పుడు నేషనల్ హైవేపై కనిపిస్తోంది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఓఆర్‌ఆర్ అయితే రయ్యమంటూ పరుగెడుతున్న వాహనలతో నిండిపోయింది. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే చీమలు మాదిరిగా వాహనాలు కదులుతున్నాయి. కీసర టోల్‌ప్లాజా వద్ద రద్దీని నియంత్రించేందుకు పోలీసులు వాహనాలను వేర్వేరు మార్గాల్లో పంపిస్తున్నారు.
కొన్ని చోట్ల రోడ్లు రిపేర్ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చౌటుప్పల్ కూడలిలో అండర్‌పాస్ నిర్మాణం జరుగుతోంది. అందుకే అక్కడ భారీగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సోమవారం వరకు విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై హైవే ఇలానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ రద్దీ నియంత్రణకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను పెట్టారు. ఎక్కడా ట్రాఫిక్ ఆగిపోకుండా వాళ్లు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
జాతీయ రహదారిపై పరిస్థితి ఇలా ఉంటే హైదరాబాద్‌లో పరిస్థితి వేరే లెవల్‌లో ఉంది. ఎంజీబీస్, జేబీఎస్, దిల్‌సుఖ్ నగర్ బస్టాండ్లు, ఎల్బీ నగర్ కూడళ్లు జాతరను తలపిస్తున్నాయి. సికింద్రాబాద్, చర్లపల్లి, కాజిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లు అయితే కుంభమేళా మాదిరిగా దర్శనమిస్తున్నాయి. పండగకు ఊరు వెళ్లే వారితో కేపీహెచ్‌బీ, అమీర్‌పేట, ఎల్బీనగర్, పనామా, వనస్థలిపురం వద్ద తరచూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. నార్మల్‌గా ప్రయాణించే నగరవాసుల కోసం ఎప్పటికప్పుడు అధికారులు ప్రత్యామ్నాయ రూట్‌లు చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో అలర్ట్‌లు జారీ చేస్తున్నారు.
హైదరాబాద్ మెట్రో కూడా కిక్కిరిసిపోయింది. ఆ చివరి నుంచి బస్‌లలో రావడం ఇష్టం లేని ప్రయాణికులంతా మెట్రో ఎక్కుతున్నారు. నార్మల్‌గా రోజూ వెళ్లే వారు ఉండనే ఉంటారు. దీంతో మెట్రో ఫుల్ రష్ అవుతోంది. ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్‌లను నగరంలోకి రానివ్వడం లేదు. అందుకే వాళ్లు మినీ బస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అవి అన్ని స్టాప్‌ల వద్ద ఆగుతూ వచ్చేసరికి చాలా సయమం వృథా అవుతుంది. అంత టైం వేస్ట్ చేయడం ఇష్టం లేని వాళ్లు బస్ సమయానికి ఓ అరగంట ముందు మెట్రోలో వచ్చేస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో మెట్రో జనంతో కిక్కిరిసిపోతోంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీలు ప్రత్యేక బస్‌లు ఏర్పాటు చేశాయి. వీటికి తోడు ప్రైవేటు ట్రావెల్స్ ఉండనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ యాజమాన్యాలు రేట్లు పెంచకపోయినప్పటికీ ప్రైవేటు ట్రావెల్స్ మాత్రం విపరీతంగా దోచుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఎంత హెచ్చరించినా వాళ్లు పట్టించుకోవడం లేదు. విచ్చలవిడిగా దోచుకుంటున్నాయి.
ట్రైన్‌లు, బస్‌లు, ప్రైవేటు వాహనాలే కాదు విమాన టికెట్ల రేట్లు కూడా భారీగా పెరిగిపోయాయి. హైదరాబాద్, బెంగళూరు నుంచి విశాఖ వచ్చే వారికి విమాన టికెట్ 15వేల రూపాయలకుపైగానే చూపిస్తోంది. నార్మల్ రోజుల్లో 4 వేల వరకు ఉండేవి. ఇప్పుడు పెరిగిన రేట్లు చూసిన ప్రయాణికులకు తలపట్టుకుంటున్నారు. అయినా తగ్గేదేలే అన్నట్టు ప్రయాణాలు సాగిస్తున్నారు.
Also Read: సంక్రాంతికి స్పెషల్ బస్సుల టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

