Pawan Kalyan: 'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
Andhra News: గ్రీన్ కో సోలార్ ప్రాజెక్ట్ దేశంలోనే మరో చోట లేదని.. దీని ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. శనివారం కర్నూలు జిల్లాలో ఆయన పర్యటించారు.

AP Deputy CM Pawan Kalyan Visited Greenco Solar Project Through Areial View: రాష్ట్రంలో గ్రీన్ కో సోలార్ పార్కుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. కర్నూలు జిల్లాలో (Kurnool District) శనివారం పర్యటించిన ఆయన పిన్నాపురం (Pinnapuram) వద్ద ఏర్పాటైన అతిపెద్ద గ్రీన్ కో సోలార్ పార్క్, పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా అధికారులతో కలిసి పరిశీలించారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ప్రజా ప్రతినిధులు, సోలార్ పార్కు ప్రతినిధులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు.
'దేశంలో రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడి'
కర్నూలు జిల్లా, పిన్నాపురం వద్ద ఏర్పాటైన ప్రపంచంలోనే అతి పెద్దదైన పిన్నాపురం గ్రీన్కో సోలార్ పవర్ ప్రాజెక్టు పవర్ హౌస్ ను హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. ఇక్కడ ఒకే ప్రాంతంలో విండ్ పవర్, సౌర విద్యుత్, హైడల్ పవర్… pic.twitter.com/YHOEdrmeuD
— JanaSena Party (@JanaSenaParty) January 11, 2025
గ్రీన్ కో కంపెనీకి అంతర్జాతీయంగా మంచి పేరుందని.. దేశంలో రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడి పెడుతుండగా.. రాష్ట్రంలో రూ.35 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు పవన్ తెలిపారు. 'కేంద్రం అనుమతితో 365 హెక్టార్ల అటవీ భూమిని సంస్థ కొనుగోలు చేసింది. అందుకు నెల్లూరులో రూ.36 కోట్ల విలువైన భూమిని సంస్థ ప్రభుత్వానికి ఇచ్చింది. ఫారెస్ట్, రెవెన్యూ మధ్య 45 హెక్టార్ల భూమి వివాదంలో ఉంది. 11.49 ఎకరాల భూమిని రైతుల నుంచి గ్రీన్ కో కంపెనీ తీసుకుంది. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మొత్తం 2,800 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇలాంటి సమీకృత ప్రాజెక్టు దేశంలో మరోచోట లేదు. ఈ భూమిపై రెవెన్యూ, అటవీ శాఖ మధ్య వివాదాన్ని పరిష్కరించాలని కేంద్రానికి విన్నవించాం. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ పర్యాటక కేంద్రం కానుంది. కేంద్రం కూడా దీనికి తగిన సహకారం అందించాలి.
గ్రీన్ కో కంపెనీ పిన్నాపురంలో ఇప్పటికే రూ.12 వేల కోట్ల పెట్టుబడి పెట్టింది. మరో రూ.10 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల దేశానికే మంచి పేరు వస్తుంది. సీఎస్ఆర్ కింద పలు కార్యక్రమాలు చేయాలని కోరుతున్నా. పాఠశాలలు, సేంద్రియ సాగు, గోవుల సంతతి పెంచేలా చూడాలి. 50 వేల మందికి ఉపాధి కల్పిస్తోన్న గ్రీన్ కో కంపెనీకి ధన్యవాదాలు' అని పవన్ కల్యాణ్ తెలిపారు.
బుక్ ఫెయిర్‌లో పవన్
అంతకుముందు విజయవాడలోని బుక్‌ఫెయిర్‌ను పవన్ సందర్శించారు. ప్రతి స్టాల్‌లో పుస్తకాలు పరిశీలించి.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలు కొనుగోలు చేశారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి పలు పుస్తకాలు పరిశీలించారు. ప్రముఖ రచయితల నుంచి యువ రచయితల వరకూ పలువురి రచనలను కొనుగోలు చేశారు. అదే విధంగా ప్రాచీన సాహిత్యంపై వెలువరించిన విశ్లేషణలు, పరిశీలన పుస్తకాలను ఎంచుకున్నారు. ఈ సందర్భంగా తనకు ఎంతో నచ్చిన ‘మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ పుస్తకం చూసి ఎంతో సంతోషించారు. డా.విక్టర్ ఈ ఫ్రాంకిల్ రాసిన ఈ పుస్తకం చదివితే నిరాశా నిస్పృహలు అధిగమించి ఆశావాద భావన కలుగుతుందని చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీల నిర్బంధాల్లో ఉన్న ఫ్రాంకిల్ ఎలా భవిష్యత్ జీవితాన్ని నిలుపుకొన్నాడో ఆ రచన తెలుపుతుందని చెబుతూ బహుమతిగా ఇవ్వడానికి ఉంటాయని ఎక్కువ సంఖ్యలో ఈ పుస్తకాలు కొనుగోలు చేశారు.
Also Read: CM Chandrababu: సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

