KTR IT Report: హైదరాబాద్‌లో 1.83 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు - వార్షిక ఐటీ నివేదిక విడుదల
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐటీ సెక్టార్‌లో 3.20 లక్షల ఉద్యోగాలు ఉంటే.. ఇప్పుడు 7 లక్షలకు పైచిలుకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి వచ్చామని కేటీఆర్ చెప్పారు.
హైదరాబాద్ కేంద్రంగా 2013-14లో ఐటీ ఉత్పత్తులు రూ.56 వేలు కోట్లుగా ఉంటే, అది నేడు రూ.1.83 లక్షల కోట్లకు చేరిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో దూసుకుపోతోందని చెప్పారు. హైటెక్ సిటీలోని టీ హబ్‌లో మంత్రి కేటీఆర్ సోమవారం (జూన్ 5) 9వ వార్షిక ఐటీ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఐటీ రంగంలో బెంగళూరుతో పోటీ పడేలా హైదరాబాద్‌ను నిలబెట్టామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐటీ సెక్టార్‌లో 3.20 లక్షల ఉద్యోగాలు ఉంటే.. ఇప్పుడు 7 లక్షలకు పైచిలుకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి వచ్చామని చెప్పారు. ఐటీ రంగం దూసుకెళ్లేందుకు తమ టీమ్ బాగా పని చేస్తోందని కేటీఆర్ ప్రశంసించారు. ఐటీ రంగంలో కేంద్రం నుంచి సహకారం ఏమీ లేదని విమర్శించారు. మాట సాయం తప్ప కేంద్రం ఎలాంటి అండదండలు అందించలేదని అన్నారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు కేటాయిచిన ఐటీఐఆర్‌ను కూడా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. అయినా నిలదొక్కుకుని ఐటీ రంగాన్ని అగ్రభాగాన నిలబెట్టామని కేటీఆర్ తెలిపారు.
త్వరలో ఈ మొబిలిటీ వీక్..
నల్లగొండ, సిద్దిపేట, సిరిసిల్ల, వరంగల్, మహబూబ్‌నగర్ లాంటి పట్టణాలకు కొత్త ఐటీ సంస్థలు వస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. ‘‘వరంగల్‌కు టెక్ మహీంద్రా, జెన్ ప్యాక్ లాంటి సంస్థలు వస్తున్నాయి. మహబూబ్‌నగర్‌లోనూ కొన్ని సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. నల్లగొండ వంటి టైర్ 2 పట్టణాలకు పరిశ్రమలు వస్తున్నాయి. ఫాక్స్‌కాన్ సంస్థ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. త్వరలోనే ఈ మొబిలిటీ వీక్ నిర్వహించబోతున్నాం. టీ వర్క్స్ సంస్థకు ఇటీవలే కేంద్రం అవార్డు ఇచ్చింది. టీ వర్క్స్ స్ఫూర్తితో మహారాష్ట్ర ఎం వర్క్స్ ఏర్పాటు చేయబోతుంది అని కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్‌కు బాష్ (BOSH)
హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు జర్మనీ కంపెనీ బాష్ ముందుకొచ్చిందని కేటీఆర్ చెప్పారు. ‘‘మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ హైదరాబాద్‌కు వస్తోంది. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ సెంటర్ ఈ ఏడాది వస్తుంది. మరో రెండేళ్లలో డజోన్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ వస్తోంది. అమెరికాకు చెందిన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హైదరాబాద్‌లో డెవలప్ సెంటర్ నిర్మిస్తోంది. అమెరికాకు చెందిన జాప్‌కామ్ సెంటర్ కూడా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతోంది. టెక్నిప్ ఎఫ్ఎంసీ కంపెనీ సెంటర్ కూడా వస్తోంది’’ అని కేటీఆర్ అన్నారు.
బెల్లంపల్లికి వాషింగ్టన్ సంస్థ
‘‘ఈ మధ్య అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌లో అనేక మంది పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యాను. బెల్లంపల్లిలో పెట్టుబడులు పెట్టేందుకు రెండు వాషింగ్టన్ కు చెందిన కంపెనీలు ఆసక్తి చూపాయి. అనేక అమెరికా కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయి. అమెరికాకు చెందిన క్వాల్‌కామ్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతోంది. గూగుల్ కూడా హైదరాబాద్‌లో అతిపెద్ద కేంద్రం నిర్మిస్తోంది. భారత్ కంపెనీ ఎల్‌టీఐ మైండ్ ట్రీ కంపెనీ వరంగల్‌లో పెట్టుబడులు పెడుతోంది. గ్రిడ్ డైనమిక్స్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతోంది. సైబర్ నేరాలు అరికట్టేందుకు సైబర్ క్రైమ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ తెస్తున్నాం’’ అని కేటీఆర్ ప్రసంగించారు.