Hyderabad IIIT: త్రిబుల్ ఐటీ హైదరాబాద్ సిల్వర్ జూబ్లీ టాక్ సిరీస్ ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
IIIT-H Silver Jubilee Talk: త్రిబుల్ ఆటీ హైదరాబాద్ సిల్వర్ జూబ్లీ టాక్ సిరీస్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు చెప్పారు.
IIIT-H Silver Jubilee Talk: త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ టాక్ సిరీస్ ను మంత్రి కే తారక రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్ టెక్నాలజీ అభివృద్ధి, ఆర్థిక ప్రగతి, హైదరాబాద్ వంటి అనేక అంశాలపైన ప్రసంగించారు. అనంతరం విద్యార్థులు, ఆధ్యాపకులతో మాట్లాడారు. ఈ క్రమంలోనే పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సమావేశంలో త్రిబుల్ ఐటీ హైదరాబాద్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ రాజిరెడ్డి, సభ్యులు జయష్ రంజన్, అజిత్ రంగనేకర్, శ్రీని రాజు, చంద్రశేఖర్, ప్రొఫెసర్ లింగాద్రి వంటి పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్, లాంగ్వేజ్ టెక్నాలజీ, కంప్యూటర్ విజన్, సస్టైనబిలిటీ, స్మార్ట్ సిటీస్ వంటి రంగాల్లో పలు స్టార్ట్ అప్స్ రూపొందించిన ప్రయోగాలను ఉత్పత్తులను పరిశీలించారు.
Minister @KTRBRS today inaugurated @iiit_hyderabad’s Silver Jubilee Talk series with a fireside chat with the students, faculty & key stakeholders of the educational institute. The freewheeling discussion revolved around technology, development, economic growth and Hyderabad. pic.twitter.com/Flwou7f9BB
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 27, 2023
ఈరోజు మానవ జీవితంలో టెక్నాలజీ ఓ భాగంగా మారిపోయిందని.. అయితే ఈ టెక్నాలజీ మానవ జీవితంలో సానుకూల మార్పు తీసుకురావాలని అన్నారు. లేనిపక్షంలో టెక్నాలజీ వృధా అన్నది తన ప్రగాఢ విశ్వాసం అని కేటీఆర్ తెలిపారు. భారతదేశం టెక్నాలజీ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తున్నప్పటికీ దేశీయంగా అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులు రాకపోవడానికి ప్రధాన కారణం ఇన్నోవేషన్ లేకపోవడమే అని కేటీఆర్ అన్నారు. దేశంలో ఇన్నోవేషన్ ఈకో సిస్టంని బలోపేతం చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని, తమ ప్రయత్నంలో భాగస్వాములు కావాలని విద్యార్థులను ఆహ్వానించారు. టెక్నాలజీ ఆధారిత ఇన్నోవేషన్ ను ముందుకు తీసుకెళ్లే విద్యార్థులు, యువకులు దేశ భౌగోళిక ఆర్థిక సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్లినప్పుడే విజయం సాధిస్తారన్నారు.
ఇప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న పేద దేశంగానే ఉందని ఇదే అంశాన్ని అనేక గణాంకాలు నిరూపిస్తున్నాయన్న కేటీఆర్, ఈ దిశగా భారత దేశానికి అత్యంత కీలకమైన వ్యవసాయం వంటి రంగాల్లో టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను చూపించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్ కోసం ప్రయత్నం చేయాలని ఇందుకోసం అత్యంత క్రియేటివ్ గా, ఒరిజినల్ గా ఆలోచించాలని సూచించారు. అప్పుడే ప్రపంచం దృష్టిని ఆకర్షించే సాంకేతిక ఆవిష్కరణలు సాధ్యమవుతాయని తెలిపారు. భారత దేశంలో ఇప్పటికీ పరిశోధన మరియు అభివృద్ధి రంగాల్లో ప్రభుత్వాలు తక్కువగా ఖర్చు చేస్తున్నాయని దీని పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ట్రిపుల్ ఐటీ లాంటి ఉన్నత విద్యా సంస్థల్లోని విద్యార్థులు తమ పరిశోధనలు, ఆలోచనలకు మరింత పదును పెట్టాలని సూచించారు. పరిశోధన - అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా తమ పాఠ్య ప్రణాళికలను, విద్యా బోధన పద్ధతులను మార్చుకుంటే మరిన్ని మెరుగైన ఫలితాలు ఈ రంగంలో వస్తాయని కేటీఆర్ అన్నారు.
పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి కేటీఆర్ హైదరాబాద్ గురించి హైదరాబాద్ అభివృద్ధి ప్రస్థానం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్ టెక్నాలజీ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తుందని ఇప్పటికే అనేక ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు తమ అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాదులో ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కేటీఆర్ దీంతోపాటు హైదరాబాద్ నగరంలో ఉన్న లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడుకొని ఉన్నదని, ప్రస్తుతం ఉన్న 50 బిలియన్ డాలర్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమను 2028 నాటికి 100 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకు వెళ్లాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. భారతదేశ యువకుల దగ్గర సమస్యల పరిష్కారానికి సంబంధించిన సామర్థ్యం అత్యద్భుతంగ ఉందని తెలిపిన కేటీఆర్.. ఈ బలాన్ని ఉపయోగించుకొని వినూత్నమైన ఆవిష్కరణలను అన్ని రంగాల్లో తీసుకు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే స్టార్ట్ అప్ లను ఏర్పాటు చేసుకొని తమ ఆవిష్కరణలతో ముందుకు వచ్చే యువకులు వాటిని పెట్టుబడి దారులకు ప్రజెంటేషన్ ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తన అనుభవం ప్రకారం ఈ రంగంలో ఔత్సాహిక యువకులు కొంత వెనుకబడి ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయంపైన ఫోకస్ పెట్టాలని కేటీఆర్ సూచించారు. తమ ప్రోడక్ట్ గురించి సరైన విధంగా పెట్టుబడిదారునికి చెప్పగలిగితే దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది సిద్ధంగా ఉన్నారని, అంతర్జాతీయ సంస్థలు సైతం భారతదేశ స్టార్ట్ అప్ లలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని కేటీఆర్ తెలిపారు.