Harish Rao Review: థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రెడీ.. పడకలు సిద్ధం, ఒమిక్రాన్ ఆందోళన వేళ మంత్రి హరీశ్ సమీక్ష
మంత్రి హరీశ్ రావు వైద్యశాఖ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం వివరాలను డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డి వివరించారు.
కరోనా వైరస్ పరివర్తనం చెంది ఒమిక్రాన్‌గా మానవాళిని మరోసారి ఆందోళనకు గురి చేస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలంగాణలోని వైద్యశాఖ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూ అనంతరం వివరాలను డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డి మీడియాకు వివరించారు. ఒమిక్రాన్ వల్ల కరోనా థర్డ్ వేవ్ కనుక ఎదురైతే దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. అందుకు సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. అయితే, ప్రస్తుతానికి దేశంలో ఒమిక్రాన్ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి రోగ తీవ్రత తగ్గుతుందని డీహెచ్ వివరించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు అందరూ వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు. రెండు డోసులు పూర్తి చేసుకున్న ఆరు నెలలకు బూస్టర్ డోస్ అవసరం ఉంటుందని వివరించారు. దీనిపై కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉందని, అంతవరకు ప్రజలు వేచి ఉండాలని కోరారు.
ఏర్పాట్లు ఇవీ..
‘‘రాష్ట్రంలో మూడో ముప్పుని ఎదుర్కొనేందుకు 60,099 పడకలు సిద్ధంగా ఉన్నాయి. వైద్యపరమైన మౌలిక సౌకర్యాల కోసం ప్రభుత్వం మరో రూ.424 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో 27,966 పడకలు ప్రభుత్వ వైద్యంలోనే ఉన్నాయి. ఇవన్నీ ఆక్సిజన్ పడకలే. పిల్లల కోసం ప్రత్యేకంగా 10 వేల పడకలు సిద్ధం చేసి.. రూ.256 కోట్లు ఖర్చు చేస్తున్నాం. చిన్నారుల కోసం ప్రభుత్వంలోనే 2 వేల ఐసీయూ సహా 6 వేల ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 132 ఆక్సిజన్ ప్లాంట్లు సిద్ధమవుతున్నాయి.’’ అని డీహెచ్ వివరించారు.
మాస్కు ధరించడం, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని శ్రీనివాసరావు సూచించారు. ఒమిక్రాన్ వైరస్, దాని నిర్మాణానికి సంబంధించి ప్రభావంపై స్పష్టమైన అవగాహన రావడానికి మరో రెండు వారాల సమయం పడుతుందని శ్రీనివాసరావు వెల్లడించారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
విమానాశ్రయాల్లో నిబంధనలు ఇవీ..
‘‘విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై దృష్టి పెట్టాం. రెండు డోసుల టీకా తీసుకున్నవారిని ఇంటికి పంపించి.. క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నాం. వ్యాక్సిన్ తీసుకోని లేదా ఒకే డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి పరీక్షలు చేసి, పాజిటివ్ వస్తే ఆసుపత్రికి తరలిస్తున్నాం. వైరస్ విశ్లేషణకు సీడీఎఫ్‌డీకి పంపిస్తున్నాం.’’
గత వైరస్ రకాలతో పోల్చితే ప్రమాదం..
‘‘కరోనా వైరస్‌లో ఇప్పటికే 3.5 లక్షల నుంచి 4 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. కొన్ని బలహీనంగా ఉంటే.. మరికొన్ని బలంగా ఉంటాయి. గతంలో వచ్చిన డెల్టా కన్నా ఒమిక్రాన్ తీవ్రత 30 రెట్లు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దేశంలోకి ఈ వైరస్ చేరకుండా జాగ్రత్తపడుతూ తక్కువ నష్టంతో బయటపడాల్సి ఉంది. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.’’
మరింతగా వ్యాక్సిన్ డ్రైవ్‌లు
‘‘రాష్ట్రంలో కరోనా కేసుల్లో పెరుగుదల లేదు. రోజుకి 100 నుంచి 150 కేసులు ఉంటున్నాయి. తెలంగాణలో ఇప్పటిదాకా 90 శాతం మందికి ఒక డోసు వ్యాక్సిన్ అందింది. రెండో డోసు 45 శాతం పూర్తయింది. ఫస్ట్ డోసు టీకా తీసుకున్న 25 లక్షల మంది గడువు దాటినా రెండో డోసు తీసుకోలేదు. వీరంతా తీసుకోవాలి. ఇంకా టీకాలు తీసుకోని 10 శాతం మందికి తొలి డోసు ఇచ్చేందుకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. రెండో డోసు టీకా తీసుకోని వారి కోసం ప్రత్యేక డ్రైవ్‌లను విస్తృతం చేయాలని నిర్ణయించింది.
పిల్లల్ని స్కూళ్లకు పంపొచ్చు
‘‘జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలను నిరభ్యంతరంగా ప్రత్యక్ష తరగతులకు పంపించవచ్చు. అక్కడక్కడ పిల్లలకు కరోనా సోకుతున్నా.. వ్యాధి తీవ్రం కావడం లేదు. కరోనా నిర్ధారణ అయిన పిల్లలను విడిగా ఉంచితే సరిపోతుంది’’ అని డాక్టర్ శ్రీనివాస్‌రావు సూచించారు.
Also Read: AP TS Corona Updates: ఏపీలో కొత్తగా 178 కేసులు, ఆరుగురు మృతి
Also Read: Dollar Seshadri Is No More: తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత