బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్
చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు పార్థివదేహాన్ని అంత్యక్రియల కోసం సొంతూరైన నారావారిపల్లెకు తీసుకెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి.. అక్కడి నుంచి స్విమ్స్ అంబులెన్స్ లో నారావారిపల్లెకు తరలించారు. పార్థివదేహంతో పాటు రామ్మూర్తి నాయుడు తనయులు నారా రోహిత్, నారా గిరీష్, మంత్రి నారా లోకేష్, ఇతర బంధువులు ఉన్నారు. నారా వారిపల్లెలో అంత్యక్రియల ఏర్పాటులో భాగంగా నివాళి అర్పించే క్రమంలో నారా రోహిత్ దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. ఆయన కుటుంబ సభ్యులు అంతా విషాదంతో కనిపించారు. తన తండ్రి చనిపోగానే నవంబర్ 16న నారా రోహిత్ ఎక్స్‌లో భావోద్వేగ పోస్టు పెట్టారు. మీరొక ఫైటర్ నాన్నా.. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు.. నాకు ప్రేమించడం, జీవితాన్ని గెలవడం నేర్పించారు.. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి మీరే కారణం. ప్రజలను ప్రేమించడంతో పాటు.. మంచి కోసం పోరాడాలని చెప్పారు. మీ జీవితంలో ఎన్నో కష్టాలున్నా అవి మా దగ్గరికి చేరకుండా పెంచారు. నాన్నా.. మీతో జీవితాంతం మరచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు మాకున్నాయి. నాకు ఏం చెప్పాలో తోచడం లేదు.. బై నాన్నా’’ అని నారా రోహిత్ పోస్ట్ చేశారు. రామ్మూర్తి నాయుడు చివరి చూపు కోసం మాజీ మంత్రి దేవినేని ఉమతో పాటు, కుటుంబ సభ్యులు, ఇతర నేతలు అక్కడికి చేరుకొని నివాళి అర్పిస్తున్నారు. ఆయన తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలు జరిగిన చోటే రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు.