MandaKrishna: 'కడియం శ్రీహరి వల్లే రాజయ్య బర్తరఫ్' - మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు
Telangana Politics: వరంగల్ జిల్లాలో మాదిగలను రాజకీయంగా ఎదగనీయకుండా కడియం శ్రీహరి అడ్డుకున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
MandaKrishna Sensational Comments on Kadiyam Srihari: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదిగల రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నది కడియం శ్రీహరి (Kadiyam Srihari) అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) ఆరోపించారు. వరంగల్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. '40 ఏళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లా లో కడియం శ్రీహరి మాదిగ అని చెప్తూ రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకులను వాడుకుంటూ కడియం ఎదిగారు. ఆయన రాజకీయ చరిత్రలో ఏ ఒక్క మాదిగ బిడ్డనూ ఎదగనివ్వలేదు. తాటికొండ రాజయ్యను రాజకీయ కుట్రలతో మోసం చేశారు. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు మొదట గుర్తింపునిచ్చింది ఎమ్మార్పీఎస్. ఆయన డిప్యూటీ సీఎం స్థాయికి ఎదగడం మాదిగలందరకీ గర్వకారణం. రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఆ పదవిని కడియం శ్రీహరి లాక్కున్నారు. రాజయ్యపై కావాలనే దుష్ప్రచారం చేయించారు. రాజయ్యకు మళ్లీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టికెట్ ఇచ్చేవారు. కానీ శ్రీహరి వల్లే రాజయ్యను బీఆర్ఎస్ బర్తరఫ్ చేసింది' అని మండిపడ్డారు. వరంగల్ బిడ్డగా.. వరంగల్ జిల్లాకు చెందిన వాడిగా.. ఇక్కడి రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని మందకృష్ణ అన్నారు.
'అడుగడుగునా అడ్డుకున్నారు'
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎదుగుదలకు కూడా కడియం శ్రీహరి సహకరించలేదని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఆరూరి రమేష్ కాంట్రాక్టర్ గా జీవితాన్ని మొదలుపెట్టి ఒంటరిగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందారని చెప్పారు. వరంగల్ ప్రస్తుత ఎంపీ పసునూరి దయాకర్ కూడా మాదిగ సామాజికవర్గం సాకారంతో ఎదిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. పసునూరుకి కూడా రెండోసారి టికెట్ రాకుండా కడియం శ్రీహరి కుట్రలు చేశారని మండిపడ్డారు. ఎన్నో డ్రామాల మధ్య వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ టికెట్ తన కూతురికి వచ్చే విధంగా రాజకీయం చేశాడని తీవ్ర విమర్శలు చేశారు. మాదిగల ఎదుగుదలను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలు ఎవరు ఓటు వేయొద్దని మందకృష్ణ పిలుపునిచ్చారు. కడియం శ్రీహరికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు.
Also Read: BRS MP Candidates: బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులుగా మాజీ అధికారులు- ఇద్దరితో జాబితా విడుదల