Mancherial News : జాతీయ సమైక్యత ర్యాలీలో అపశృతి, 30 మంది విద్యార్థులకు అస్వస్థత
Mancherial News : తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలలో అపశృతి చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో 30 మంది విద్యార్థులు ఎండ తీవ్రత తట్టుకోలేక స్పృహ తప్పిపడిపోయారు.
Mancherial News : తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలలో అపశృతి నెలకొంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సమైక్యత ర్యాలీలో సుమారు 30 మంది విద్యార్థులు స్పృహ కోల్పోయి కిందపడిపోయారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు తట్టుకోలేక ర్యాలీలో స్పృహ కోల్పోయి ఎక్కడికక్కడే పడిపోవడంతో 108 అంబులెన్స్ ద్వారా వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అసలేం జరిగింది?
మంచిర్యాల జిల్లాలోని ప్రతి పాఠశాలలోని విద్యార్థులను జాతీయ సమైక్యత ర్యాలీలో పాల్గొనాలని విద్యాశాఖ నుంచి ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలకు ఉత్తర్వులు జారీ చేయడంతో మంచిర్యాల పట్టణంలోని జిల్లా బాలుర పాఠశాల మైదానం నుంచి డిగ్రీ కళాశాల మైదానం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర ర్యాలీని చేపట్టారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొందరు విద్యార్థులు తట్టుకోలేక ర్యాలీలో స్పృహ కోల్పోయి ఎక్కడికక్కడే పడిపోయారు. వారిని 108 అంబులెన్స్ ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురు విద్యార్థులకు సెలైన్లు పెట్టి వైద్యం అందించారు వైద్యులు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం కుదుటుగా ఉందని వైద్యులు తెలపడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. తమ విద్యార్థులను రాజకీయ ర్యాలీలకు పిలువద్దని పలుమార్లు విన్నపించుకున్నామని జిల్లా ట్రస్మా అధ్యక్షుడు విష్ణువర్ధన్ ఆరోపించారు. అయినప్పటికీ తమను సమైక్యత ర్యాలీ విజయవంతం చేయాలని ఉద్దేశంతో ఓటు హక్కు రాని విద్యార్థినిలను ఇలాంటి సమావేశాలకు పిలిచి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులకు పాచిపోయిన ఆహారం
జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఈ వేడుకలలో పాల్గొన్న విద్యార్థులకు దుర్వాసన వస్తున్న భోజనం అందించారు. వాసన వస్తుండడంతో ఆహారాన్ని కొద్దిగా తిని వదిలేశారు విద్యార్థులు. ఎండలో ర్యాలీలో తిప్పి వారికి పాచిపోయిన ఆహారం పెట్టడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యత వజ్రోత్సవాలకు ప్రభుత్వం లక్షల్లో డబ్బులు కేటాయించగా స్థానిక నేతల కక్కుర్తి పడి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడారని ఆరోపించారు. దీంతో తేరుకున్న నేతలు, అధికారులు ఆహార పదార్థాలను గుట్టుచప్పుడు కాకుండా డస్ట్ బిన్ లో పడేశారు. ఎవరి కంటపడకుండా విద్యా్ర్థులను కూడా పంపించేశారు. ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా ఎమ్మార్వో సమాధానం ఇవ్వలేదు.
10 వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలతో సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 75వ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని NIRD నుంచి వ్యవసాయ విశ్వవిద్యాలయ గ్రౌండ్ వరకు ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులతో పాటు 10 వేల మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ర్యాలీ అనంతరం వ్యవసాయ విశ్వవిద్యాలయ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థుల డాన్స్, స్పీచ్ లతో అలరించారు.
Also Read : Minister Puvvada Ajay : భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు, జాతీయ పార్టీలపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్