Minister Puvvada Ajay : భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు, జాతీయ పార్టీలపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్
Minister Puvvada Ajay Kumar: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జాతీయ పార్టీలపై ఫైర్ అయ్యారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.
Minister Puvvada Ajay Kumar: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ర్యాలీని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఖమ్మం అంబేద్కర్ సెంటర్ నుంచి ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాభిమానాన్ని పొందాలంటే సైద్ధాంతికంగా, ఆలోచనాత్మకంగానే సాధ్యమవుతుందని అప్రజాస్వామికంగా, చట్టాలను ఉల్లంఘిస్తూ భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా సాధ్యం కాదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తేల్చి చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యత, ఈ ప్రాంత విశిష్టతను చాటిచెప్పేలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా @MC_Khammam Zp సెంటర్ నుండి SR&BGNR కళాశాల వరకు నిర్వహించిన భారీ ర్యాలీ ప్రదర్శనను ప్రారంభించి పాల్గొనడమైంది(1/3). @TelanganaCMO @MinisterKTR @KTRTRS @Collector_KMM pic.twitter.com/dct7gk9Swq
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) September 16, 2022
జాతీయ జెండా చేత బట్టి.. ర్యాలీలో పాల్గొన్న మంత్రి
జాతీయ జెండా చేతబూని ర్యాలీలో మంత్రి కదిలారు. తెలంగాణ ప్రాంతం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి 75వ వసంతంలోకి ప్రవేశిస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ చెప్పారు. ఓ జాతీయ పార్టీ చరిత్రను వక్రీకరిస్తుందని స్వాతంత్ర పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వారి పాత్ర శూన్యం అన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విష సంస్కృతిని మరింతగా పెంచుతున్నారని మండి పడ్డారు. కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణ ఎనిమిదేళ్లలోనే అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా దూసుకుపోతున్న తరుణంలో ఇక్కడి శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేసేందుకు నీచ రాజకీయానికి తెరలేపారని ఆరోపించారు. దుర్మార్గమైన, అనారోగ్యకరమైన, అనాలోచిత విధానంతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు.
రేపటితో 75 ఏళ్లు పూర్తి..
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్ర్యం రాలేదన్నారు. ఆనాడు నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానం ఉన్న విషయాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుర్తు చేశారు. 1948 సెప్టెంబర్ 17 న రాచరికపు వ్యవస్థ నుండి ప్రజాస్వామ్యంలోకి అడుగు పెట్టినందున జాతీయ సమైఖ్యత దినోత్సవాలను సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. నిజాం సంస్థానం భారత్ లో విలీనమైన రోజు రేపటితో 75 ఏళ్లు పూర్తి కానుందన వజ్రోత్సవాలు నిర్వహించనున్నామన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై వ్యవహరించిన తీరును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ కార్యక్రమమైనా నిర్వహించవచ్చన్నారు.
అటు విమోచనం.. ఇటు విలీనం
బీజేపీ ఆధ్వర్యంలో విమోచన వేడుకలు నిర్వహించాలని ప్లాన్ చేయగా.. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విలీన దినోత్సవం జరిపేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం అయి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు వజ్రోత్సవాలను గుర్తుండి పోయేలా నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఇదే రోజుల్లో ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను సుందరంగా ముస్తాబు చేయాలని అధికారులకు సూచనలు అందాయి. విద్యుత్ దీపాలతో ఆఫీసులను అలంకరిస్తున్నారు. అసెంబ్లీ, బీఆర్ కే భవన్, జీహెచ్ఎంసీ, డీజీపీ ఆఫీసులు.. విభిన్న రంగుల్లో మెరిసి పోతున్నాయి.
మూడ్రోజుల పాటు వేడుకలు..
మూడు రోజుల ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 16న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువత, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17న రాష్ట్రమంతటా జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. మరుసటి రోజు సెప్టెంబర్ 18న అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులను, సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పిన కవులు, కళాకారులు, ఇతర ప్రముఖులకు సన్మానం చేయనున్నారు. తెలంగాణ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది.