(Source: ECI/ABP News/ABP Majha)
Revant Vs Mallareddy : నిన్న తొడగొట్టి సవాల్ - ఇవాళ అమాయకుడ్నని కవరింగ్..! మల్లారెడ్డి ఇరుక్కుపోయారా..?
రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణల్ని మల్లారెడ్డి బలంగా తిప్పికొట్టలేకపోయారు. భూముల గురించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. జవహర్‌నగర్‌లోని తన ఆస్పత్రి ప్రభుత్వ స్థలంలోనే ఉందని అంగీకరించాల్సి వచ్చింది.
రేవంత్ రెడ్డిపై తొడగొట్టి " తిట్ల వర్షం " కురిపించిన తెలంగాణ మంత్రి మల్లారెడ్డిని చూసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే ముచ్చటపడ్డారు. మల్లారెడ్డిలో కాస్త జోష్ ఎక్కువేనని సమర్థించారు. కానీ అదే మల్లారెడ్డి ఈ రోజు తొడకొట్టిన ప్లేస్‌లోనే ప్రెస్‌మీట్ పెట్టారు. ఏడ్వలేక నవ్వుతున్నట్లుగా మాట్లాడారు. ఆయన ప్రెస్‌మీట్ పెట్టింది రేవంత్ రెడ్డిపై విరుచుకుపడటానికే. అదీ కూడా తనపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించడానికే. కానీ కేటీఆర్ ముచ్చటపడిన జోష్ మల్లారెడ్డి చూపించలేకపోయారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు అబద్దాలని తొడకొట్టలేదు. తప్పుడు పత్రాలని కేసు పెడతానని కూడా హెచ్చరించలేదు. దీంతో మల్లారెడ్డి కంగారు పడుతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలపడిపోతోంది.
మూడు చింతల పల్లిలో రేవంత్ రెడ్డి దళిత, గిరిజన దీక్షను చేపట్టారు. ముగింపు సభలో కేసీఆర్‌పైనా... మేడ్చల్ ఎమ్మెల్యే కం మంత్రి అయిన మల్లారెడ్డిపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గంటలోనే ప్రెస్‌మీట్ పెట్టిన మల్లారెడ్డి రేవంత్ రెడ్డిపై తిట్ల వర్షం కురిపించారు. రాజీనామా చేసి తేల్చుకుందాం రమ్మని తొడకొట్టి సవాల్ చేశారు. మల్లారెడ్డి స్పందన హాట్ టాపిక్ అయింది. తర్వాతి రోజు కూడా మీడియాను పిలిచి సాయంత్రం వరకూ సమయం ఇస్తున్నా అని కౌంట్ డౌన్ పెట్టారు. అయితే రేవంత్ రెడ్డి తాను మల్లారెడ్డి అల్లుడిపైనే గెలిచానని ఆయన సవాల్‌ను తేలిగ్గా తీసుకున్నారు కానీ.. మల్లారెడ్డి అక్రమాలంటూ పెద్దజాబితా బయట పెట్టారు.
మల్లారెడ్డిపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇవి..!
1965 నాటికి గుండ్లపోచంపల్లి సర్వే నంబర్ 650లో మొత్తం 22 ఎకరాల 8 గుంటల భూమి ఉంది. 2001 నాటికి కూడా అదే 22 ఎకరాల భూమి ఉంది. కానీ కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో మాత్రం 33 ఎకరాల 26 కుంటలకి పెరిగింది. సర్వే నంబర్‌లో 22 ఎకారాలున్న భూమి అమాంతం 33 ఎకరాలకు ఎలా పెరిగింది. అదే సర్వే నంబర్ 650లోని 33 ఎకరాల్లో 16 ఎకరాలు మల్లా రెడ్డి బావమరిది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త శ్రీనివాసరెడ్డి పేరు మీద ఉంది. దాన్ని ఆయన మల్లా రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి గిఫ్ట్ డీడ్ ఇచ్చారు. బావమరిది ఆస్తి ఊరకనే మల్లారెడ్డికి ఎందుకు ఇచ్చాడు..? జవహర్ నగర్‌లోని సర్వే నంబర్ 488లో 5 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్ ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ క్రయవిక్రయాలు నిషేధించింది. ఇప్పుడదే భూమి రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. మల్లా రెడ్డి కోడలు షాలినీ రెడ్డి కొనుగోలు చేసింది. అందులో సీఎంఆర్ హాస్పిటల్స్ కట్టి వ్యాపారం కూడా చేస్తున్నారు. మల్లా రెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి సతీమణి షాలినీ రెడ్డి .. జవహర్‌నగర్ వైస్ చైర్మన్ పేరుతో ఉన్న భూమి షాలినీ రెడ్డి పేరు మీదకు ఎలా వచ్చాయి..?. నిషేధిత భూమిగా అధికారులు పేర్కొన్న అదే భూమికి రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి..? ఇంజనీరింగ్ కాలేజీకి న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంటే తప్పుడు పత్రాలు సమర్పించారంటూ ఐదేళ్ల నిషేధం విధించింది.. అలాంటి కాలేజీని యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఎలా అనుమతులు ఇచ్చారు..?
రేవంత్ రెడ్డి బయటపెట్టినవి జిరాక్స్‌లంటూ తడబడిన మల్లారెడ్డి..!
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించేందుకు ప్రెస్‌మీట్ పెట్టిన మల్లారెడ్డి సూటిగా దేనికీ సమాధానం ఇవ్వలేదు. 650 సర్వే నెంబర్‌లో భూములు ఎలా పెరిగాయో.. అవి ఆయన బావమరిది పేరు మీదకు ఎలా రిజిస్టర్ అయ్యాయో.. వాటిని తనకు ఎందుకు గిఫ్ట్ డీడ్ చేశారో వివరించలేదు. ఆయన తన దగ్గర బావరిది కాదని.. దూరపు బంధువని.. అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అదే సమయంలో జనవహర్ నగర్ స్థలం ప్రభుత్వానిదేనని అంగీకరించారు. అక్కడ ఉన్నదంతా ప్రభుత్వ స్థలమేనని సీఎం కేసీఆర్ పేదలకు ఇచ్చారని చెప్పుకొచ్చారు. తన కోడలు షాలినిరెడ్డికి ఐదు ఎకరాలు లేదని ఖండించారు. కేవలం 350గజాలే ఉందన్నారు. అందులో ఆస్పత్రి కట్టి పేదలకు సేవలు అందిస్తున్నామని ఆయన చెప్పారు. కానీ 350 గజాల్లో ఆస్పత్రి ఎలా కడతారనే డౌట్ అందరికీ వస్తుందనే విషయాన్ని ఆయన మర్చిపోయారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలన్నీ ఉత్తవేనని.. ఆయన జిరాక్స్ డాక్యుమెంట్లు ప్రదర్శించారని.. తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తన కాలేజీలకు అన్నీ అనుమతులు ఉన్నాయని వాదించారు. కానీ భూకబ్జా ఆరోపణలపై మాత్రం సూటిగా సమాధానం చెప్పకపోవడంతో అనుమానాలు మాత్రం ప్రారంభమయ్యాయి.
తప్పుడు ఆరోపణలైతే విచారణకు ఆదేశిస్తారా..?
మంత్రి మల్లారెడ్డిపై వచ్చినవి తీవ్రమైన ఆరోపణలు. అవి తప్పుడు ఆరోపణలు అని ఆయన చెబుతున్నారు. అందుకే విచారణ జరిపించి అవి తప్పుడువి అయితే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అవి నిజమైన డాక్యుమెంట్లు అయితే మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలన్న వాదన రాజకీయవర్గాలతో పాటు సామాన్యుల్లోనూ వినిపిస్తోంది. ఇవి రాజకీయ ఆరోపణల్లా ఉండకూడదని అంటున్నారు. అవినీతి ఆరోపణలతో రాజయ్య, ఈటలను బహిష్కరించి విచారణ చేయించినట్లుగానే మల్లారెడ్డి కి చెందిన భూ డాక్యుమెంట్లపైనా విచారణ జరగాలని అంటున్నారు.