Tiger News: చిరుత పులిని ఢీకొన్న గుర్తు తెలియని వాహనం -తీవ్ర గాయాలతో మృతి
Telangana : మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు శివారులోని 44వ జాతీయ రహదారిపై ఓ వాహనం చిరుత పులిని ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలతో చిరుత అక్కడికక్కడే మృతి చెందింది.

Telangana : జంతువులు ఉండాల్సిన అభయారణ్యాల్లో మనుషులు సంచరిస్తున్నారు. మనుషులు జీవించే ప్రదేశంలోకి జంతువులు రావడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. ఏది ఎలా జరగాలో అలా జరగకపోతే, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకపోతే అనుకోని ప్రమాదాలు తప్పవని మరోసారి రుజువైంది. తాజాగా జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుత పులి రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు శివారులోని అటవీ నర్సరీ సమీపంలో గురువారం సాయంత్రం 44వ జాతీయ రహదారిపైకి వచ్చిన ఓ చిరుత పులిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో చిరుత తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ అక్కడికి పెద్ద మొత్తంలో గుమికూడిన జనాలు, రహదారి వెంట వస్తోన్న వాహనాల పైకి దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఎవరూ దాని దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. చిరుత కొద్దిసేపు అలా గాయాలతోనే బాధపడుతూ అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం పోలీసులు ఇచ్చిన సమాచారంలో అటవీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. వల్లూరు అడవి ప్రాంతంలోనే ఆ మృతి చెందిన చిరుత పులికి పోస్టుమార్టం చేయించి పూడ్చి పెట్టనున్నట్టు తెలిపారు.
రహదారిపై వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడం వల్లే చిరుత మరణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిరుత పులికి ఆరు నుంచి ఏడేళ్ల వయసుండొచ్చని మెదక్ జిల్లా అటవీ అధికారి ఎం. జోజి తెలిపారు. ఇది రోజూ నర్సరీలోని చెక్ డ్యామ్‌కు నీరు తాగడానికి వస్తూంటుందని, అంతకుముందు రెండు సార్లు కూడా తనకు కనిపించిందన్నారు. అనేక జంతువులు కూడా ఈ చెక్ డ్యాం వద్దకు నీళ్లు తాగేందుకు వస్తాయన్నారు. దీనికి సమీపంలోనే ఒక రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం ఉంది. ఇది చిరుతపులికి సరైన నివాసంగా ఉండేదని ఆ అధికారి తెలిపారు. అనేక వన్యప్రాణులు ఎన్ హెచ్ 44 విస్తీర్ణాన్ని ఉపయోగిస్తున్నందున, జంతువులను రోడ్డుకు ఒక వైపు నుండి మరొక వైపుకు సురక్షితంగా దాటడానికి వన్యప్రాణి అండర్‌పాస్ లేదా ఓవర్‌పాస్ అవసరం అని ఆయన తెలిపారు.
తిరుమల శిలాతోరణం వద్ద చిరుత కలకలం
ఇదిలా ఉండగా తిరుమలలోనూ ఓ చిరుత పులి కలకలం రేపుతోంది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. అనంతరం టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కాగా దీనిపై ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు.
కేరళలో మ్యాన్ ఈటర్ హతం
కేరళలోని వయనాడ్ లో ఓ మహిళపై దాడి చేసి, చంపిన పులి కళేబరాన్ని అధికారులు అడవిలో గుర్తించారు. అనంతరం దానికి పోస్టుమార్టం నిర్వహించగా.. పులి కడుపులో ఒక జత బంగారు దిద్దులు లభ్యం కావడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో కాఫీ తోటలో రాధ అనే మహిళా కూలీని హతమార్చిన పులి ఇదేనని అధికారులు నిర్ధారించుకున్నారు. అనంతరం ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా అనుమానాస్పద ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.
Also Reas : First GBS Case in Hyderabad: తెలంగాణలో తొలి గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు, ఓ మహిళకు జీబీఎస్ పాజిటివ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

